రాష్ట్రాలకు మోడీ సర్కార్ భారీ టాస్క్

August 15, 2020

మిగిలిన దేశాలతో పోలిస్తే.. భారత్ లో కరోనా కేసుల పెరుగుదల ఒక మోస్తరుగా ఉందని.. ముందస్తుగా తీసుకున్న దేశ వ్యాప్త లాక్ డౌన్ కార్యక్రమం మంచి ఫలితాల్నే అందించినట్లుగా వార్తలు వచ్చాయి. అనూహ్యంగా ఢిల్లీలోని నిజాముద్దీన్ లో తబ్లిగ్ జమాత్ నిర్వహించిన మత సదస్సు దెబ్బకు సీన్ మొత్తం మారిపోయింది. పలు దేశాల నుంచి రెండు వేలకు పైగా విదేశీయులు ఈ సదస్సులో పాల్గొనటానికి రావటమేకాదు.. సదస్సు అయిపోయిన తర్వాత వివిధ రాష్ట్రాలకు వారు వెళ్లిన విషయాన్ని గుర్తించారు.
తాజాగా ఈ సదస్సులో పాల్గొన్న వారికి పెద్ద ఎత్తున పాజిటివ్ కేసులునమోదు అవుతున్న నేపథ్యంలో.. ఇందులో పాల్గొన్న వారిని గుర్తించే కార్యక్రమం ఒకటి ఇప్పటికే మొదలైంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఢిల్లీ ప్రార్థనల్లో పాల్గొన్నవిదేశీయులు పలువురు తమ తమ దేశాలకు వెళ్లలేదని చెబుతున్నారు. అలా వెళ్లని వారు దేశ రాజధానిలో ఉండిపోకుండా దేశం నలుమూలలకు వెళ్లారని చెబుతున్నారు.
దీంతో.. అర్జెంట్ గా అన్ని రాష్ట్రాలకు భారీ టాస్కు ఇచ్చింది కేంద్రప్రభుత్వం. ఢిల్లీ సదస్సులో పాల్గొని వివిధ రాష్ట్రాలకు వెళ్లిన విదేశీయులు ఎక్కడున్నా గుర్తించాలని.. వారిని అదుపులోకి తీసుకోవాలని కోరినట్లు తెలుస్తోంది. ఒక అంచనా ప్రకారం దేశ వ్యాప్తంగా 824 మంది విదేశీయులు వేర్వేరు రాష్ట్రాల్లో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇలాంటివారి కారణంగానే కరోనా వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోందన్న అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం.
అందుకే.. ఈ సదస్సులో పాల్గొన్న విదేశీయుల్ని గుర్తించి.. వారి దేశాలకు వెంటనే పంపేయాలన్న యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. అయితే.. వీరెక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు? అన్నది ప్రశ్నగా మారింది. దీంతో.. రాష్ట్రాలకు వీరిని గుర్తించే బాధ్యతను అప్పజెప్పింది. విదేశీ విమానాల రాకపోకలు బంద్ అయిన నేపథ్యంలో.. దేశవ్యాప్తంగా జల్లెడ వేసి.. వారిని అదుపులోకి తీసుకోవటం మొదటి ప్రాధాన్యతగా మారినట్లు చెబుతున్నారు. ఎంత త్వరగా వారిని గుర్తిస్తే.. అంత త్వరగా వ్యాప్తిని కంట్రోల్ చేసే వీలుందంటున్నారు.