అలరించిన శాక్రమెంటో తెలుగు సంఘం 16వ వార్షికోత్సవం 

August 03, 2020

కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాక్రమెంటో తెలుగు సంఘం (టాగ్స్) 16 వ వార్షికోత్సవం, సంక్రాంతి సంబరాల సందర్భంగా టాగ్స్ ప్రత్యేకంగా రూపొందించిన సాంస్కృతిక కార్యక్రమాలు  ఆహుతులను విశేషంగా ఆకట్టుకొన్నాయి. రంగవల్లులు, సంక్రాంతి జట్కా బండి, పాలవెల్లి సెట్టింగ్, గాలిపటాలు మరియు 400 కు పైగా ఉన్న కళాకారులు చేసిన సందడితో సంక్రాంతి వేడుకల ప్రాంగణంలో ఆహ్లాదకరమైన పండుగ వాతావరణం నెలకొంది. స్థానిక ఫోల్సోం నగరం లో ఉన్న ఫాల్సం హైస్కూల్ ధియేటర్ లో శనివారం జనవరి 18న మధ్యాహ్నం 12 గంటలకు మొదలైన సంక్రాంతి సంబరాలు రాత్రి 11 వరకు కొనసాగాయి.

కార్యక్రమంలో "తియ్యని భాషరా బిడ్డా మనది తియ్యని భాషరా అమ్మ ప్రేమ లెక్క జున్ను పాల లెక్క కమ్మని భాషరా" అంటూ పలు లలిత గీతాలు ఆలపించిన స్థానిక తెలుగు పిల్లలు.  త్యాగరాజ కృతులు, ఆంధ్ర నాట్యంతో కళాకారులు  అలరించారు.  సంక్రాంతి వేడుకల సందర్భంగా టాగ్స్ ఆధ్వర్యంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల అతిథులకు  స్థానిక డేవిస్ నగరం లో ఉన్న స్థానిక ప్రీతి ఇండియన్ రెస్టారెంట్ నొరూరుంచే గోంగూర, అరిసె, బొబ్బట్టు తో కూడిన పసందైన తెలుగు వంటకాలు వడ్డించింది. కదలి రండి, కలసి రండి, సంక్రాంతి సంబరాన్ని ఉమ్మడిగా జరుపుకొందాము అని టాగ్స్ఇచ్చిన పిలుపుకు స్పందించిన స్థానిక తెలుగు కుటుంబాలు 1500 మందికి పైగా వేదిక కు తరలివచ్చారు. కార్యక్రమానికి స్థానిక ఫాల్సం మేయర్ సారా అక్వినో, కాలిఫోర్నియా శాసనసభ సభ్యుడు కెవిన్ కైలీ, కాలిఫోర్నియా రాష్ట్ర ముఖ్య సమాచార అధికారి ఏమీ టోంగ్, రాక్లిన్ నగర కౌన్సిల్ సభ్యుడు బిల్ హలిడిన్ లు ప్రియమైన అతిథులుగా హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తెలుగు కళలపై తెలుగు పిల్లలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలకు అచ్చెరువొందారు. టాగ్స్ చైర్మన్ అనిల్ మండవ, వైస్ చైర్మన్ మల్లిక్ సజ్జనగాండ్ల,  ప్రెసిడెంట్ నాగ్ దొండపాటి, కోశాధికారి మోహన్ కాట్రగడ్డ, సమాచార అధికారి రాఘవ చివుకుల  నేతృత్వంలో టాగ్స్ కార్యవర్గం ఈ సందర్భంగా  ప్రియమైన అతిధులందరికీ జ్ఞాపికలు అందజేసి ఘనసన్మానం గావించింది. కాలిఫోర్నియా సెనెటర్ షానన్ గ్రోవ్ ఈ సందర్భంగా సంక్రాంతి సందేశాన్ని వీడియో ద్వారా టాగ్స్ సభ్యులకు పంపించారు.

ఈ కార్యక్రమంలో శివారు నగరాలైన స్థానిక ఫాల్సం, నాటోమాస్, ఎల్ డోరాడొ,  రాంచో కార్డోవా సెంటర్లలో చదువుతున్న సిలికానాంధ్ర మనబడి విద్యార్థులు చక్కని తెలుగు పద్యాలు, కథలు, పాటలు వేదికపై ప్రదర్శించారు. సిలికానాంధ్ర మనబడి అధ్యక్షుడు రాజు చామర్తి ప్రియమైన అతిథిగా టాగ్స్ సత్కారాన్ని అందుకొన్నారు. మనదైన భాషను తరువాతి తరాలకు అందజేయడానికి సిలికానాంధ్ర మనబడి చేస్తున్న ప్రయత్నంలో అందరూ తోడ్పడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వేదికపై బాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, చదరంగం తదితర పోటీలలో గెలుపొందిన విజేతలకు టాగ్స్ కార్యనిర్వాహక సభ్యులు జ్ఞాపికలు అందజేశారు. తరువాత స్థానిక రోజ్ విల్ నగరంలో ఉన్న "అక్షర మన సంస్కృతి" సంస్థ సహకారంతో నడుస్తున్న తెలుగు బడి పిల్లలు వేదికపై పాడిన తెలుగు పద్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

టాగ్స్ సమాచార అధికారి రాఘవ చివుకుల సమర్పణ గావించారు. అంతకు మునుపు శనివారం జనవరి 11న శ్రీ శ్రీనివాస కల్యాణోత్సవాన్ని అదే వేదిక ప్రాంగణంలో ఉదయం 9 గం కు టాగ్స్ ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమం కోసం ఫ్రీమాంట్ నగర దేవాలయం నుండి విచ్చేసిన పూజారులు  శ్రీ శ్రీనివాస కళ్యాణోత్సవం పూజ నిర్వహించారు. పూజానంతరం తీర్ధ ప్రసాదాలను భక్తులకు టాగ్స్ కార్యకర్తలు అందజేశారు. అనంతరం జరిగిన చిన్నారులకు  భోగిపళ్లు కార్యక్రమంలో అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. రేగిపళ్ళు, పూలు, అక్షంతలతో చిన్నారులను పూజకు విచ్చేసిన  పెద్దలు అందరూ ఆశీర్వదించారు.
కాలిఫోర్నియా శాక్రమెంటోలో సంక్రాంతి సంబరాలు, శ్రీ శ్రీనివాస కల్యాణోత్సవం విజయవంతం కావడంలో టాగ్స్ కార్యవర్గ సభ్యులు, టాగ్స్ కార్యకర్తల కృషి ఎనలేనిది. 

ఈ సందర్భం గా టాగ్స్ కార్యనిర్వాహక సభ్యులు “భారత్ లో ఉన్న అనాథ భారతీయ బాలబాలికలకు సహాయార్ధం శాక్రమెంటో కేంద్రంగా పనిచేస్తున్న హోప్ అబైడ్స్ సంస్థ”, హైదరాబాద్ లో ఉన్న వేగేశ్న ఫౌండేషన్, రెండు తెలుగు రాష్ట్రాల గ్రామాలలో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్న సువిధా ఇంటర్నేష్నల్ ఫౌండేషన్, దివ్యాంగులకు అండగా ఉంటున్న స్థానిక “వీఎంబ్రేస్” స్వచ్ఛంద సంస్థ కు టాగ్స్ ప్రత్యేకం గా విరాళాలు అందజేస్తుంది అని, ఈ సంస్థలకు సహాయార్ధం విరాళం ఇవ్వదలచిన వారు మరింత సమాచారం కోసం sactags@gmail.com కు ఈమెయిలు లో సంప్రదించాలని టాగ్స్ కార్యనిర్వాహక సభ్యులు కోరారు.

TAGS Sankranti 2020 Photos and Videos can be downloaded from this link : https://tinyurl.com/TagsSankranti2020