తలసానికి ఉన్న ఆ మాత్రం క్రెడిట్ కూడా గంగలో కలిసిందా..?

July 03, 2020

రాజకీయాల్లో క్రియాశీలంగా పాల్గొనడం అంటే కేవలం ఒక్క పార్టీకే వత్తాసు పలుకుతూ, వారెన్ని అరాచకాలు చేసినా వెనకేసుకురావడం కాదు.. ప్రజలతో మిళితమవుతూ ప్రజా సంక్షేమం కోసం అనుక్షణం పాటు పడటమే అసలు రాజకీయం. కానీ తలసానికి అవేవీ పట్టనట్టున్నాయి. తన రాజకీయ లబ్ది కోసం ఆయన పడుతున్న పాట్లు చూసి నవ్వుకుంటున్నారు జనం. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబుపై విమర్శలు చేయడానికి తలసాని శ్రీనివాస్ యాదవ్‌.. ఎలాంటి పరిమితులు పెట్టుకోవడం లేదు. తాను ఆ పార్టీలో పుట్టి పెరిగిన విషయాన్ని కూడా మరిచి టీడీపీ పై ఆయన విరుచుకుపడుతున్న తీరు పై ఏపీ ప్రజానీకంతో సహా స్వయంగా ఆయన కుటుంబీకులే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

టీఆర్ఎస్ నేతల్లో ఒక్క తలసాని మాత్రమే టీడీపీపై ఎక్కువగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇన్నాళ్లు తలసాని అలా మాట్లాడుతున్నా.. ఆయన బంధువులైన పుట్టా సుధాకర్ యాదవ్, యనమల రామకృష్ణుడు మాట్లాడకపోవడం టీడీపీ వర్గాల్లో అనేక విమర్శలకు కారణం అయ్యాయి. బంధుత్వానికి ప్రాధాన్యం ఇస్తున్నారన్న విమర్శలు వారిపై వెల్లువెత్తాయి. అయితే ఎన్నికలు ముగిసిన తర్వాత ఒక్కసారిగా పుట్టా సుధాకర్ యాదవ్ ఫైర్ అయ్యారు. తన మనసులోని మాటలను బయటపెట్టి సంచనం సృష్టించారు. తలసాని.. రాజును మించిన రాజభక్తి చూపిస్తున్నాడని ఆయన మండిపడ్డారు. జగన్ కోసం టీఆర్ఎస్ నేతలు పోటీపడి పని చేస్తుండటం విడ్డురంగా ఉందని ఆయన అన్నారు.

బీసీల వంచనకు వైఎస్ కుటుంబం కేరాఫ్ అడ్రస్ అని వ్యాఖ్యానించిన పుట్టా.. వైఎస్ కుటుంబం బీసీలకు చేసిన అన్యాయంపై తలసాని శ్రీనివాస్ ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. అలాంటి వారి కోసం టీఆర్ఎస్ నేతలతో పాటు తలసాని పని చేయడం బాధాకరమన్నారు. తెలంగాణలో బీసీలకు జరిగిన అన్యాయంపై మాట్లాడకుండా.. కేసీఆర్ వద్ద మార్కుల కోసం జగన్‌ను తలసాని వెనకేసుకొస్తున్నారని మండిపడ్డారు. వైసీపీకి అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారా? పదేపదే ఏపీ వ్యవహారాల్లో ఎందుకు తలదూరుస్తున్నారని ప్రశ్నిస్తూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తలసానిని నోరు అదుపులో పెట్టుకోవాలని పుట్టా వేసిన కౌంటర్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. టీడీపీలో తన దగ్గర బంధువులు కీలక పాత్ర పోషిస్తూండటాన్ని కూడా.. ఆయన ఏ మాత్రం లెక్క చేయకుండా కేవలం రాజకీయ లబ్ది కోసం తలసాని తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని జనం చెప్పుకుంటున్నారు. వైసీపీకి తొత్తుగా తలసాని వ్యవహారం అంత మంచిది కాదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఆయన రాజకీయ చరిత్ర తెలిసిన విశ్లేషకులు. టీడీపీలో ఉన్నపుడు ఉన్న క్రెడిట్ లో ఇప్పుడు తలసానికి సగం క్రెడిట్ కూడా లేదని.. పైగా ఇలా వైసీపీకి వత్తాసు పలికితే ఉన్న ఆ మాత్రం క్రెడిట్ కూడా గంగలో కలిసిపోవడం ఖాయం అంటున్నారు కొందరు.