తలసాని ఆ మాట అన్నారా? తొలిసారి క్లాస్ పడిందా?

August 06, 2020

ఫైర్ బ్రాండ్ ఇమేజ్ మాత్రమే కాదు.. హైదరాబాద్ మహానగరంలో మాస్ నేతగా గుర్తింపు.. తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సొంతమని చెప్పాలి. టీఆర్ఎస్ పార్టీలో మనసుకు తోచినట్లుగా మాట్లాడే ముగ్గురు నేతల్లో ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆయన కుమారుడు కమ్ మంత్రి కేటీఆర్ అయితే మూడో వ్యక్తి మంత్రి తలసాని. ఆ మాటకు వస్తే.. మాయదారి రోగం నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ లో అదే పనిగా రివ్యూలు పెట్టిన ఏకైక మంత్రిగా ఆయన్ను చెప్పాలి. 
రాజకీయంగా కావొచ్చు. మరే ఇష్యూ మీదనైనా తనదైన శైలిలో స్పందించే ఆయనకు.. తొలిసారి ఎదురుదెబ్బ తగిలిందా? అన్నదిప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తన శాఖకు చెందిన అంశంపై స్పందించి ఆయన కొత్త తలనొప్పిని తెచ్చుకున్నారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఒక ఆంగ్ల మీడియా సంస్థతో మాట్లాడిన సందర్భంలో సినిమా థియేటర్లను ఎప్పుడు ఓపెన్ చేస్తారన్న అంశంపై ఆయన చెప్పినట్లుగా చెబుతున్న మాటలు రచ్చగా మారాయి. 
లాక్ డౌన్ వేళ థియేటర్స్ తెరిస్తే సమస్యలు వస్తాయని.. ఒకవేళ థియేటర్లు తెరిచినా భయంతో ప్రేక్షకులు రాకపోవచ్చన్న వ్యాఖ్య చేసినట్లుగా చెబుతున్నారు. అంతేకాదు.. భౌతిక దూరం పాటించేందుకు వీలుగా థియేటర్లను మార్పులు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మల్టీఫ్లెక్సుల్లో సీట్ల మార్పు తొందరగానే అవుతుంది కానీ.. జిల్లాల్లోని థియేటర్లలో మార్పు అంత తేలిక కాదన్న అభిప్రాయాన్ని పేర్కొన్నట్లుగా చెబుతున్నారు. మొత్తంగా మరో మూడు.. నాలుగు నెలల వరకూ థియేటర్లు తెరిచే అవకాశం లేదన్నది ఆయన మాటగా మీడియాలో వచ్చింది.
అదిప్పుడు కొత్త సమస్యలకు కారణమైందంటున్నారు. ఇప్పటికే కిందామీదా పడుతున్న సినిమా రంగం..మంత్రివారి మాటలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు చెబుతున్నారు. మరో మూడు నెలల పాటు థియేటర్ల బంద్ అంశాన్ని ఆయన ప్రస్తావించకుండా ఉండాల్సిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సినిమా రంగ పెద్దలు పలువురు తలసాని మాటపై అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ.. అధినాయకత్వం వద్దకు తీసుకెళ్లినట్లుగా చెబుతున్నారు. ఎప్పుడూ లేని రీతిలో.. ఈ విషయంపై ముఖ్యమంత్రి నుంచి ఊహించని రీతిలో స్పందన వచ్చినట్లుగా సమాచారం.
దీంతో.. తలసాని తీవ్ర అసహనంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏ విషయంలోనూ తనను తప్పు పట్టని సీఎం సాబ్.. తన శాఖకు సంబంధించిన అంశంపై స్పందించిన దానికి ఇలాంటి పరిస్థితి ఎదురుకావటాన్నిఆయన జీర్ణించుకోలేకపోతున్నట్లుగా తెలుస్తోంది.
ఈ ఇష్యూను ఇక్కడితో వదిలేయాలని.. అదే పనిగా మీడియాలో రావటం కూడా మంత్రివారు ఇష్టపడటం లేదన్న మాట వినిపిస్తోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తలసాని చెప్పినట్లుగా మరో మూడు నెలల పాటు థియేటర్లు తెరవకపోతే మాత్రం చిత్రపరిశ్రమ తీవ్రమైన గడ్డు పరిస్థితి ఎదుర్కొనే అవకాశం ఎక్కువనే చెప్పాలి.