పెళ్లికి వెళ్లిన తెలంగాణ మంత్రికి దిమ్మ తిరిగే షాక్..!

June 29, 2020

తెలంగాణ రాష్ట్ర మంత్రి ఒకరికి చేదు అనుభవం ఎదురైంది. సంతోషంగా పెళ్లికి వెళ్లిన ఆయన.. హ్యాపీగా తనను పలుకరించేందుకు వచ్చిన వారితో మాట్లాడుతూ సరదాగా గడుపుతున్న ఆయనకు ఊహించని షాక్ తగిలింది. పెళ్లికి వెళ్లిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేతికి ఉన్న కడియాన్ని ఎత్తేసిన వైనం కాస్త ఆలస్యంగా బయటకు వచ్చి సంచలనంగా మారింది. ఏకంగా మంత్రికి టార్గెట్ చేసి.. తెలివిగా  కొట్టేసిన వైనం పోలీసులకు కొత్త ఇబ్బందిని తెచ్చి పెట్టింది. దీనికి తోడు సదరు కడియం అంటే మంత్రివర్యులకు మహా సెంటిమెంట్ ఉండటం వారిని మరింత ఇరుకున పడేసింది.
పెళ్లికి వచ్చిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ బంగారు కడియం కొట్టేసిన వారి కోసం పోలీసులు ప్రయత్నాలు షురూ చేశారు. . ముమ్మరంగా విచారణ జరుపుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోని దేవరకద్రలో ఒక పెళ్లి వేడుకకు హాజరయ్యారు అమాత్యులు. మంత్రిగారిని చూసినంతనే పలువురు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహాన్ని ప్రదర్శించారు. అలా కాసేపు సరదాగా గడిచిన తర్వాత చేతి వైపు చూసుకున్న ఆయనకు షాక్ తగిలినట్లైంది.
ఎందుకంటే చేతికి ఉండాల్సిన బంగారు కడియం లేకపోవటంతో.. దాని సంగతి చూడాలని ఆదేశించారు. తన అనుచరులపైనా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తన చుట్టూ అంతమంది చేరినప్పుడు ఏం జరుగుతుందన్న విషయాన్ని పట్టించుకోరా? అని క్లాస్ పీకారు. ఎందుకింత కోపం అంటే.. ఆ కడియానికి శ్రీనివాస్ గౌడ్ ఇచ్చే ప్రాధాన్యత అంతమరి. ఆ కడియంతో ఆయనకున్న సెంటిమెంట్ చాలా అని చెబుతారు. ఆ కడియం పెట్టుకున్న తర్వాతే విజయాలు దక్కాయని.. అలాంటిది మిస్ కావటంతో అంత నిరాశకు గురైనట్లు తెలుస్తోంది. కొట్టేసిన మంత్రిగారి కడియం దొరుకుతుందా? అన్నది క్వశ్చన్ గా మారింది.