టీడీపీ ముఖ్య నేతను వైసీపీలో చేర్చే ప్రయత్నం చేస్తున్న తలసాని

December 12, 2019

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో అక్కడి పార్టీలతో పాటు, తెలంగాణలో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి కూడా తెగ హడావిడి చేస్తోంది. కొద్ది నెలల కిందట తెలంగాణలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ సహా మరో రెండు పార్టీలతో కలిసి ప్రజాకూటమిని ఏర్పాటు చేయడం.. ఆ సందర్భంగా జరిగిన పలు పరిణామాలతో టీఆర్ఎస్ బాస్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆగ్రహంతో ఉన్నారు. అందుకే ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత జరిగిన మీడియా సమావేశంలో ‘‘తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నాకు గిఫ్ట్ ఇచ్చారు.. త్వరలోనే ఆయనకూ రిటర్న్ గిఫ్ట్ ఇస్తా’’నంటూ సంచలన ప్రకటన చేశారు. అప్పటి నుంచి ఏపీలో ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఆయన పావులు కదుపుతున్నారు. ఆయనే కాదు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు సైతం ఏపీలో వైసీపీనే విజయం సాధిస్తుందని బహిరంగంగానే ప్రకటించారు. దీంతో రెండు రాష్ట్రాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో టీడీపీ ఓడించేందుకు టీఆర్ఎస్ చేస్తున్న కుట్ర గురించి ఓ సంచలన విషయం తెలుగులోకి వచ్చింది.

 

 ఇటీవల తెలంగాణ మంత్రి వర్గంలో చోటు సంపాదించుకుని ఆ రాష్ట్రంలో వరుసగా రెండోసారి మంత్రి బాధ్యతలు స్వీకరించారు తలసాని శ్రీనివాస్ యాదవ్. ఈయన కొద్దిరోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో పర్యటనలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీని ఓడించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. టీడీపీకి ప్రధాన బలంగా ఉన్న బీసీలను ఆ పార్టీ నుంచి దూరం చేయాలనే ఉద్దేశ్యంతో తలసాని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం గుంటూరులో యాదవ గర్జన కూడా నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. దీనిపై ఆయన ‘‘ఏపీ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా గుంటూరులో మార్చి 3న యాద వ గర్జన నిర్వహించి తీరుతాం. దీన్ని అడ్డుకునేందుకు చంద్రబాబు, ఆయన ప్రభుత్వం కుట్ర లు పన్నుతున్నారు. సభకు అనుమతికోరితే 9 ప్రశ్నల లేఖను ఇచ్చారు. దీన్ని చూస్తుంటే మనం భారతదేశంలో ఉన్నామా? పాకిస్తాన్‌లో ఉన్నామా? అనే సందేహం కలుగుతోంది’’ అని వ్యాఖ్యలు చేశారు.

 

 మరోవైపు, ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా ఉన్న టీడీపీ నేత పుట్టా సుధాకర్ యాదవ్‌ను వైసీపీలో చేరాలని తలసారి ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఆయన కూడా యాదవ సామాజికవర్గానికి చెందిన వ్యక్తే కావడంతోనే తలసాని ఈ విధంగా బలవంతం చేస్తున్నారని తెలుస్తోంది. ఈ విషయాన్ని పుట్టా.. చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లబోతున్నారని కూడా తెలిసింది. వాస్తవానికి గత ఎన్నికల్లో మైదుకూరు నుంచి ఓడిపోయిన ఆయనను చంద్రబాబు టీటీడీ చైర్మన్ చేశారు. అంతేకాదు, కొద్దిరోజుల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ పుట్టాకు సీటు ఖరారు చేశారు. ఇటీవల గురువారం జరిగిన సమీక్షలో ఈ మేరకు సంకేతాలు కూడా పంపారని సమాచారం. పుట్టా సుధాకర్‌ యాదవ్‌ 2011లో రాజకీయ ప్రవేశం చేశారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున మైదుకూరు నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఇప్పుడు మరోసారి పోటీ చేయబోతున్నారు.