తమిళనాడు రాజధాని మారుస్తారా.. మారిస్తే ఎక్కడకు?

August 08, 2020

దేశంలో మహానగరాలు కరోనాతో విలవిల్లాడుతున్నాయి.

ముంబై, ఢిల్లీ, చెన్నై... విలవిల్లాడిపోయాయి. మహానగరాలంటేనే విసుగొచ్చే పరిస్థితి వచ్చింది.

ఇక ఒక వెలుగు వెలిగిన ఆ మహానగరాలన్నీ ఇపుడు పూర్తిగా బోసిపోయాయి.

రోడ్ల మీద జనం లేరు. సగం దుకాణాలు మూసి ఉన్నాయి. తెరచిన దుకాణాలకు వ్యాపారం లేదు. అన్ని రవాణా వ్యవస్థలు స్తంభించాయి.

అసలు మహానగరాలు చేసిన మేలెంత? నష్టమెంత? అని అంచనా వేస్తే ఎకనమిక్ టర్నోవరు పరంగా అవి గ్రోత్ సాధించాయే గాని మానవాభివృద్ధి సూచికకు విరుద్ధంగా పనిచేశాయవి.

తాజాగా చెన్నై నగరం గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటాం.

కానీ గత ఏడాది నగరంలో నీరు లేక సెల్ఫ్ లాక్ డౌన్ అయ్యింది. అంతకుముందు ఏడాది వరదలతో మునిగి విలయం చూసింది.

తాజాగా కరోనాతో విలవిలలాడుతోంది. ఏమిటి చెన్నై గొప్పదనం? ఎందుకు పనికొస్తుంది ఆ మహానగరం. మనిషి కనీస అవసరం అయిన స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన గాలి లేని నగరం ఎందుకు? 

30 ఏళ్ల క్రితం ఈ ఉద్దేశంతో పాటు పలు ఇతర కారణాలతో అప్పట్లో  అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు దివంగత మహానేత ఎంజీఆర్ చెన్నై నుంచిరాజధాని మార్చడానికి ప్రయత్నించారు.

కానీ.. ఫలించలేదు. తర్వాతి కాలంలో ఈ ప్రతిపాదనకు కాస్త మార్పులు చేసి చెన్నై చుట్టు శాటిలైట్ నగరాలు చేయాలని ప్రయత్నించిన డీఎంకే మాజీ అధ్యక్షుడు దివంగత నేత కరుణానిధి సైతం విమర్శల్ని ఎదుర్కొన్నారు.

తమిళనాడురాష్ట్ర రాజధానిని చెన్నై నగరం కాకుండా మరో నగరాన్ని చేయటాన్ని జనం ఎవరూ ఇష్టపడని పరిస్థితి.

కానీ మరోనా ప్రజలను మరోసారి ఆలోచింపజేసింది. అవును... చెన్నైలో ఉండి ఇంత కష్టం అనుభవించడం అవసరమా? అని ప్రజలు ఆలోచనలో పడ్డారు. 

అంతకంతకూ పెరిగిపోతూ.. ఒక్క చెన్నైమహానగరంలోనే లక్షకు కాస్త దగ్గరగా పాజిటివ్ లు పెరిగిపోయిన వేళ.. రాష్ట్ర రాజధాని నగరం మార్పు ప్రస్తావన తెర మీదకు వచ్చింది.  

తాజాగా కరోనా అతిగా ఉండటానికి ప్రధాన కారణం విపరీతమైన జనసాంద్రత. 

అదే.. చిన్న ప్రాంతం రాజధానిగా ఉంటే.. ఇలాంటి పరిస్థితి ఉండేది కాదని జనంలో వినిపిస్తోంది.

30 ఏళ్ల క్రితం ప్రతిపాదించిన తిరుచ్చి నగరాన్ని తమిళనాడు రాజధానిగా చేసి ఉండాల్సిందని... అపుడు చెన్నై వ్యాపారం, సినిమాకు పరిమితం అయ్యేదని... తిరుచ్చి రాజకీయ, పారిశ్రామిక నగరం అయ్యేదని అంటున్నారు.

ఇపుడు ఒకే నగరంపై భారీ ఒత్తిడి పడిందని... అందుకే కరోనా ముప్పు ఇంతదారుణంగా ఉందంటున్నారు.