ఆ వార్త చెప్పగానే కారు దిగి మంత్రి పరార్

August 15, 2020

మహమ్మారి భయం చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా అందరిని వణికిస్తుంది. ఆ మాటకువస్తే మాయదారి రోగానికి సంబంధించిన భయాందోళనలు ఎక్కువగా ప్రముఖులకే ఉంటున్నాయి. కీలక పదవుల్లో ఉన్న పవర్ ఫుల్ నేతలు సైతం.. కొన్నిసార్లు రియాక్ట్ అవుతున్న తీరుకు అవాక్కు అవ్వాల్సిందే. తాజాగా అలాంటి ఉదంతమే తమిళనాడులో చోటు చేసుకుంది. తమిళనాడు దేవాదాయ శాఖ మంత్రి రామచంద్రన్ కారులో ప్రయాణిస్తున్నారు.

అంతలోనే ఆయనకు ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ సమాచారంతో ఆయన ఒక్కసారి అలెర్టు అయ్యారు. కారును వెంటనే ఆపాలని కోరారు. వెంటనే కారు దిగేశారు. ఇంతకీ.. ఎందుకంత ఆందోళన అంటే.. సదరు మంత్రి వారి కారుడ్రైవర్ కు పాజిటివ్ అని తేలటం. అంతే భయాందోళనకు గురైన ఆయన రోడ్డు మీదే నిలబడి.. మరో కారును తెప్పించుకొని ఇంటికి వెళ్లిపోయారు.

తన కారు డ్రైవర్ కు పాజిటివ్ అని తేలిన నేపథ్యంలో మంత్రి హోం ఐసోలేషన్ కు వెళ్లాలని నిర్ణయించారు. గతంలోనూ కరోనా భయంతో ఆయన టెస్టు చేయించుకున్నారు. అప్పట్లో ఆయనకు నెగిటివ్ అని వచ్చింది.

తాజాగా తన డ్రైవర్ కు పాజిటివ్ అని తేలటంతో మరోసారి టెస్టు చేసుకోవాలన్న ఆలోచనలో మంత్రివర్యులు ఉన్నట్లు చెబుతున్నారు. ఎంతవారలైనా వైరస్ పేరుకు వణకాల్సిందే. మహమ్మారా మజాకానా?