తమ్మారెడ్డి గారూ ... కామన్ సెన్స్ వాడండి సార్

June 30, 2020

తనకు తాను పెద్దరికం మీదేసుకుని తెలుగు సినిమాను, తెలుగు ప్రజలను ఉద్దరించడానికి పుట్టినట్లుగా మాట్లాడుతుంటారు తమ్మారెడ్డి భరద్వాజ. ఆయన ఏం సినిమాలు తీశారో ఠక్కున చెప్పమంటే... జనం తెల్లమొహం వేయాలి. అదీ ఆయన సినిమా స్థాయి. యూట్యూబ్ ఆదాయం కోసం వీడియోలు చేసుకునే ఈ పెద్దాయన ఈరోజు చంద్రబాబుపై విమర్శలు చేశారు. ఎవరు ఎవరి మీదయినా విమర్శలు చేసే హక్కుంది. కాకపోతే వాటిలో పస లేకపోతే జనంలో నవ్వుల పాలవుతారు అని తమ్మారెడ్డి వంటి వారు తెలుసుకుంటే మంచిది.
ఇంతకీ ఆయన ఏమన్నారంటే...
‘‘కేంద్రం జోక్యంతో కొత్త సీఎస్ ను తీసుకువచ్చారని, రాష్ట్రంలో తమను ఏమీ చెయ్యనివ్వడం లేదని చంద్రబాబు అంటున్నారని, మరి, దర్శకుడు రామ్ గోపాల్ వర్మను విజయవాడ నుంచి తిప్పి పంపించిందెవరు? బెజవాడలో వర్మ మీడియా సమావేశాన్ని అడ్డుకున్నది ఎవరు? కొత్తగా వచ్చిన సీఎస్ ఆ పనిచేశారా? లేక, రాష్ట్ర ప్రభుత్వమే వర్మ ప్రెస్ మీట్ ను ఆపిందా? లక్ష్మీస్ ఎన్టీఆర్ కోసం వర్మ ప్రెస్ మీట్ పెట్టుకోవడంలో తప్పులేదని, ఆయనను అరెస్ట్ చేసి హైదరాబాద్ తిప్పి పంపాల్సిన అవసరం ఏముందో తనకు అర్థం కావడంలేదని అన్నారు. వర్మ ఏమన్నా ఉగ్రవాదా? నక్సలైటా? లేక, దేశద్రోహా? అని నిలదీశారు.

అయ్యా తమ్మారెడ్డి గారు... ముందు దేశంలో ఏం జరుగుతుందో తెలుసుకోండి.
కొన్ని రోజుల క్రితం అంటే మోడీ బయోపిక్ రిలీజ్ కు ఒక్క రోజు ముందు ఎన్నికల సంఘం దేశంలో అన్ని బయోపిక్ ల విడుదలను ఆపేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అదే రూలు ఏపీ లో కూడా వర్తిస్తుంది. ఏపీలో ఎన్నికలు ముగిసినా దేశంలో ఎన్నికల కోడ్ ముగిసే వరకు ఏ బయోపిక్ విడుదలకు అనుమతి లేదు. ఎన్నికల సంఘం ఆదేశాలు ఉల్లంఘిస్తూ రాంగోపాల్ వర్మ మే 1న సినిమా రిలీజ్ కు ముహూర్తం పెట్టారు. అందుకే పోలీసులు దానిని అడ్డుకున్నారు. మీరు తెలుసుకోవాల్సిన మరో విషయం ఏంటంటే... ప్రస్తుతం ఏపీ యంత్రాంగం పోలీసులతో సహా అన్ని విభాగాలు ఎన్నికల సంఘం కోడ్ ప్రకారం పనిచేసే ఏపీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం కింద ఉన్నాయి. రాంగోపాల్ వర్మను అడ్డుకోవాలా, వదిలిపెట్టాలా అన్నది ఆయనే నిర్ణయించాలి. ఆయన ఆదేశాల మేరకే పోలీసులు నడుచుకున్నారు. కానీ చంద్రబాబు ఆదేశాల మేరకు కాదు. ఒకవేళ సీఎస్ వద్దంటే పోలీసులకు వర్మను అరెస్టు చేసే హక్కు లేదు. ఈ కనీస సమాచారం లేకుండా చంద్రబాబును మీరు ప్రశ్నించడం మీరు చేసిన మొదటి తప్పిదం.
ఇక ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించి సినిమాను ప్రదర్శించిన థియేటర్ల లైసెన్సులనే రద్దు చేసింది ఎన్నికల సంఘం. ఈ విషయం తెలుసుకోకపోవడం మీ రెండో తప్పు. ఎన్నికల సంఘాన్ని, ప్రజాస్వామ్యాన్ని లెక్క చేయకుండా కోడ్ ను ఉల్లంఘించే ప్రయత్నం చేసిన వర్మను ప్రశ్నించకపోవడం మీరు చేసిన మూడో తప్పు. మీరు ఇన్ని తప్పులు చేసి చంద్రబాబు భయపడ్డారు. పోలీసులు ఆపేశారు... ఆయన ఉగ్రవాదా ఏమన్నా అని అడుగుతున్నారు.
నిబంధనలు ఉల్లంఘించిన వర్మ నేరస్థుడు. ఎన్నికల చట్టం ప్రకారం ఆయన శిక్షకు అర్హుడు. కాకపోతే చంద్రబాబు కు వ్యతిరేకంగా మోడీ-జగన్-కేసీఆర్ టీంకు అనుకూలంగా పనిచేస్తున్నాడు కూడా ప్రత్యేక మినహాయింపు వర్మకు దక్కిందేమో. దీన్ని ప్రశ్నించండి మీరు.
ఎంత మీరు రెడ్డి అయితే మాత్రం నిజాలు మరిచి లేదా నిజాలు పక్కనపెట్టి మాట్లాడితే ఎలా సార్??