మండలి గురించి ఏపీ స్పీకర్ సంచలన వ్యాఖ్యలు

August 07, 2020

ప్రజలు ఎన్నుకున్న అసెంబ్లీకే విలువ అని, మండలికి ఏ విలువ లేదన్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం. ఒక ఎమ్మెల్యేకు పార్టీ ఉంటుంది గాని స్పీకరుకు ఒక పార్టీ అంటూ ఉండదు. అందుకే స్పీకరును ఎన్నుకునేటపుడు కచ్చితంగా అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లు కలిసి ఆయన్ను సీట్లో కూర్చోబెడతారు.

ఎవరైనా ఒకసారి స్పీకర్ అయ్యారు అంటే వారు మొత్తం ఎమ్మెల్యేలకు బాధ్యత వహించే వ్యక్తిగా మారిపోతారు. స్పీకరు స్థానంలో కూర్చున్నాక తాము గెలిచిన పార్టీతో ఏ సంబంధాలు ఉండకూదు. తటస్థంగా వ్యవహరించాలి. ఇది సంప్రదాయంగా వస్తున్న పద్ధతి. 

అయితే, తాజాగా ఏపీ స్పీకరు తమ్మినేని సీతారం శాసన మండలిలో టీడీపీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతుంది అంటూ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. తూర్పోగోదావరి జిల్లాలో రాజమండ్రిలో పూలే విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 

శాసన సభ అంటే ప్రజలు ఎన్నుకున్నది అని, అంతిమ నిర్ణయాలు అక్కడే తీసుకుంటారని, అదే ప్రధానమైనదని అన్నారు. అక్కడ జరిగే నిర్ణయాలు ఫైనల్ అన్నారు. శాసన మండలిలో జరిగే వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని, అన్ని రాష్ట్రాలకు ఇదే వర్తిస్తుందని, శాసన సభ అత్యున్నతమైనదని తమ్మినేని వివరించారు.

ద్రవ్య వినియమ బిల్లును అడ్డుకోవడం ద్వారా టీడీపీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడిందన్నారు. దీనివల్ల సంక్షేమ కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడుతుందని, తెలుగుదేశం వాటిని  ఆపడానికే  ఇలా చేసిందా అని ప్రశ్నించారు.

ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి మండలిలో ఆధిక్యం ఉంది. దీంతో టీడీపీ అక్కడ కొన్ని బిల్లులను వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో స్పీకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. మరి స్పీకరు స్థానంలో ఉన్నపుడు ఒక పార్టీ వైపు మాట్లాడటం సంప్రదాయం కాదు కదా.