ఓట్లేసిన ప్రజలకే తమ్మినేని వార్నింగ్

July 04, 2020

చట్ట పరిధిలో మాట్లాడినంత మాత్రాన ప్రతి మాట ప్రజామోదం పొందదు అనే కనీస విషయాన్ని మరిచిపోయిన తమ్మినేని ప్రజాస్వామ్యంలో మూలస్తంభమైన ప్రజలను చిన్నచూపు చేస్తూ కామెంట్లు చేశారు. ‘‘చట్ట సభలకు హాజరుకాకుండా నిరోధించడమంటే సభా హక్కులను హరించడమే. శాసనసభ్యుల హక్కులను హరిస్తే రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుంది. రాజ్యాంగాన్ని ఉల్లంఘించేలా ఎవరైనా వ్యవహరిస్తే చట్టం తన పని తాను చేస్తుంది’’ ఇవి ఏపీ స్పీకరు తమ్మినేని గారి వ్యాఖ్యలు. 

అయితే, స్పీకర్ తమ్మినేని గారు చాలా ప్రాథమిక విషయాన్ని మరిచిపోయారు. ఆ రాజ్యాంగం ప్రధాన కర్తవ్యవం ఈ దేశంలో ప్రజాస్వామ్యం వర్దిల్లేలా చేయడం. ప్రజాస్వామ్యంలో ప్రజలు సుప్రీం. అన్ని రాజ్యాంగ వ్యవస్థలకు ఆ హక్కులు ఇచ్చేవారు తొలగించేవారు ప్రజలు. వారు ప్రజాస్వామ్యంలో అత్యంత శక్తిమంతులు. వారి హక్కులను శిక్షించే అధికారం స్పీకరుకు కాదు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కూడా రాజ్యాంగం కల్పించలేదు అన్న ప్రాథమిక విషయాన్ని తమ్మినేని సీతారాం గమనించాలి.  ప్రజలకు నిరసన తెలిపే హక్కుంది. వారు శాంతియుత నిరసన తెలపాలని నిశ్చయించుకున్నపుడు దానిని పోలీసు చర్యతో అణచివేసే ప్రయత్నం చేసి దానిని హింసాయుతంగా మార్చడానికి ప్రభుత్వం కారణమవుతోంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా స్పీకరు సీట్లో తనను కూర్చోబెట్టిన ప్రజలకే స్పీకరు గారు వార్నింగ్ ఇస్తున్నారు. 

ప్రజలు అధికారం కట్టబెట్టింది వారి బాధ్యతలు చూసిపెట్టమని, వారిని పాలించమని, సంక్షేమ రాజ్యం నెలకొల్పమని...!! 

కానీ ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఇష్టాను సారం వాడి తప్పు చేస్తున్నది ప్రభుత్వం. దానిని నిరసిస్తున్నందుకు తిరిగి వారినే తప్పు పడుతోంది ప్రభుత్వం. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న సభ్యులను, ముఖ్యమంత్రిని, ప్రభుత్వ వ్యవస్థలను దండించాల్సిన సమయం ఇది. గత కొంత కాలంగా ఏపీలో ప్రభుత్వం, పోలీసులు, శాంతియుతంగా తమ ఆవేదన చెప్పుకుంటున్న ప్రజలను తీవ్రంగా అణచివేస్తోంది. వారు తమ ఆవేదన చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వడం లేదు. ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా మిడిసిపడిన వారు ప్రజాస్వామ్యంలో ఎన్నడూ గెలవలేదు. ఇది వైసీపీ గుర్తుంచుకోవాలి.