టాంటెక్స్ ఆధ్వర్యంలో ఘనంగా“అష్టావధానం”

November 20, 2019

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) మరియు ఉత్తరఅమెరికా తెలుగు సంఘం (తానా) సంయుక్తంగా మ‌రోమారు సాహితి అభిమానుల‌ను అల‌రించాయి. ఆగస్టు 18న అష్టావధానం కార్యక్రమాన్ని డాలస్ లో ఘనంగా నిర్వహించారు. దాదాపుగా 200 మందికి పైగా సాహితీ ప్రియులు 4 గంటల పాటు ఆసక్తితో, ఉత్సాహంగా వీక్షించి సభని జయప్రదం చేశారు. టాంటెక్స్ అధ్యక్షులు చినసత్యంవీర్నపు సభను ప్రారంభించి, డా. మేడసాని మోహన్ గారికి స్వాగతం పలికి, తానాఅధ్యక్షులు శ్రీ జయశేఖర్ తాళ్ళూరిని, ,టాంటెక్స్ మ‌రియు తానాకమిటి సభ్యులను సభకు పరిచయం చేశారు.
తానా అధ్యక్షులు జయశేఖర్ తాళ్ళూరి మాట్లాడుతూ డా. మేడసాని ప్రతిభను కొనియాడి, డాలస్ టాంటెక్స్ వారు సాహిత్యానికి ఇస్తున్న ప్రాముఖ్యతను అభినందించారు. ఈ రోజు అవధాన కార్యక్రమం తానా మరియు టాంటెక్స్ క‌లిసి నిర్వహించడం చాలా ఆనందదాయకంగా ఉంద‌ని తెలియజేశారు. కార్యక్రమంలో ముందుగా చి.తాన్వి పొప్పూరి ‘అన్నమయ్యకీర్తనలు’ ప్రారంభ గీతాలు శ్రావ్యంగా ఆలపించారు. అమెరికా తెలుగు సాహిత్యం అంటే గుర్తుకు వచ్చే పేరు ఉత్తరటెక్సాస్ తెలుగు సంఘం టాంటెక్స్ , వారు నిర్వహించే నెలనెలా తెలుగువెన్నెల కార్యక్రమము 145 నెలలుగా నిరాటంకంగా కొనసాగుతూ ఎందరో తెలుగు మహానీయులను అమెరికా తెలుగువారికి సగర్వంగా పరిచయం చేశారు. ఆగ‌స్టు 18వ తేదీన స్థానిక డల్లాస్ న‌గరంలో , ఫ్రిస్కో కార్యసిద్ధిహనుమా దేవాలయంలో సాహిత్య అభిమానులు గర్వపడేలా, తెలుగు అవధాన మధుతరంగాలు దిగంతాలకు వ్యాపించేలా తెలుగుభాషలలో అత్యంత క్లిష్టమైన అవధానప్రక్రియను , "అపూర్వపంచసహస్రఅవధానసార్వభౌమ " , అవధానబ్రహ్మ ఇలా ఎన్నో బిరుదులుగాంచి , అవధానచరిత్రలో తన పేరు బంగారు అక్షరాలతో లిఖింపచేసిన గౌరవనీయులుడా|| మేడసానిమోహన్ గారు అవధాని కావడంతో , అమెరికా నలుమూలల నుండి విచ్చేసిన అవధానప్రియులు, సాహిత్య జల్లులలో హాయిగా సేదతీరారు.
అవధానం అంటే అవధులులేని ఆనందం అనిపించేలా ఈ కార్యక్రమం సాగింది. అవధానప్రక్రియలో 8 మంది పృచ్ఛకులు పాల్గొన్నారు. ఈ పృచ్ఛకులు ఒక్కొక్కరు ఒక్కొక్క అంశంమీద అవధాని గారిని పరీక్షిస్తారు. ఎక్కడా కాగితం కలం వాడకుండా, వారు అడిగిన ఛందస్సులో , కొన్నిసార్లు చమత్కారంగా , మరికొన్నిసార్లు భక్తి పారవశ్యంతో, ఛలోక్తులతో అవధానిగారు ఇచ్చిన సమాధానాలు తెలుగువారికే ఆ ఆనందం సొంతం అనిపించేతగా సాగాయి. ఈ కార్యక్రమానికి అమెరికా అవధాని శ్రీపూడూర్ జ‌గదీశ్వర్ అనుసంధాన క‌ర్త‌గావ్యవహరించారు. ఆయన స్వహతాగా అవధాని కావడంతో ఈ కార్యక్రమాన్నిమరింత రక్తికట్టించారు. ఈ సందర్భంగా తమ ఇరువురు తిరుపతి వెంకటేశ్వర కళాశాలలో కలి సిచదువుకొన్న విషయాలు ప్రస్తావించారు. అవధాన అంశాలలో, శ్రీఊరిమిండిన రసింహరెడ్డి దత్తపది, శ్రీతోరకూర ప్రసాద్ స్తాక్షరి , శ్రీ ఉపద్రష్ట సత్యం మహాకవి ప్రసంగం, కుమారి మద్దుకూరి మధుమాహిత సమస్య, శ్రీవేముల లెనిన్ వ‌ర్ణన , శ్రీమతి కలవగుంటసుధ ఆశువు , శ్రీ కాజ సురేష్ నిషిద్ధాక్షరి అంశాలతో, శ్రీమాడ దయాకర్తన అప్రస్తుత ప్రసంగంతో, జలసూత్రం చంద్రశేఖర్ లేఖకుడిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

దత్తపది అంశంలో ఊరిమిండి నరసింహారెడ్డి చెరువు కరువు పరువు తరువు పదాలతో పోతన కృష్ణదేవరాయల వారిని రైతుల కోసం అభ్యర్ధన వర్ణించమన్నారు. కూరిమితోడ అ'చ్చెరువు' గూర్పెడి .. అన్నపద్యంతో అవధాని పూరించారు. ప్రసాద్ తోటకూరగారుతో కూ. ర. ట అక్షరాలతో న‌మ‌స్తాక్షరి సమస్య ఇచ్చారు. తీరా చూస్తే తమ ఇంటిపేరు తోట‌కూర వచ్చేలా కాశ్మీరం గురించి వర్ణించమన్నారు. అవధాని గారికి ఈ విషయం అర్ధమై ఛలోక్తులు విసిరారు. క్లిష్టమైన నిషిద్ధాక్షరి ప్రక్రియతో కాజసురేష్ అవధాని గారిని ఇబ్బంది పెట్టడానికి శాయశక్తులా ప్రయత్నించారు. అవధాని గారు ఏం చెప్పబోతున్నారో ముందే ఊహించి , ఆయా అక్షరాలను నిషేధించడం ద్వారా ఆయన దారి మళ్లించే ప్రయత్నమే క్లుప్తంగా నిషిద్ధాక్షరి అంటే.

ఆయనేమో పంచసహస్ర అవధాని, 5000 మందితో ఒకేసారి అవధానం నిర్వహించిన మహాపండితుడు, ఆయన దారులు ఆయనకు ఉంటాయి కదా అనిపించేలా చక్కగా పూరించారు. మద్దుకూరిమధుమాహిత "నీరుత్రాగవచ్చేనీరసంబు " అని చిత్రమైన సమస్యను, వేముల లెనిన్ బాబు "దేశాభిమానందురభిమానంగామారిఉన్మాదిస్థితిచేరినపుడు " కలిగే పరిణామాలు, కలవగుంటసుధ "వాలిసుగ్రీవసంగ్రామం" మీద ఆశువు , ఉపద్రష్టసత్యంఅల్లసానిపెద్దనగారిసింహావలోకఉత్పలమాలిక , హంపీ విజయనగరంలోడిండిమభట్టును ఓడించి తెలుగుసాహిత్య పతాకాన్ని ఎగురవేసిన శ్రీనాథమహాకవి గురించి కన్నడముమ్మ కవి చెప్పిన సీస పద్యం చక్కగా గానం చేస్తే అవి ఈ సందర్భాలలో ఎవరు రాసారో అవధానిగా క్ష‌ణం ఆలస్యం చెయ్యకుండా చెప్పారు. వాతావరణంలో సాహిత్యసాంద్రత ఎక్కువ అవుతున్నపుడల్లా తన ఛలోక్తులతో, అప్రస్తుత ప్రసంగంతో మాడ దయాకర్ న‌వ్వులు పూయించారు. ఈ క్రమంలో తన మామగారితో తనకున్న అనుబందం, మామ అల్లుళ్ళ సరదా సన్నివేశాలు చెప్పి అవధానిగారు పొట్టచెక్కలయ్యేలా నవ్వించారు. అవి చూసితీరవలసిందే, ఎంత గొప్ప హాస్యానుభవం అని కార్యక్రమం తర్వాతా కూడా హాస్యప్రియులు నవ్వుతూనే ఉన్నారు.

కళామతల్లికి పెద్దపీట వేసే టాంటెక్స్ అధ్యక్షులు వీర్నపు చినసత్యం, తన ఆధ్వర్యంలో పంచసహస్ర అవధాని మేడసానివారు రావడం, డల్లాస్‌లో ప్రసిద్ధ కార్యసిద్ధి హనుమాన్ అలయంలో ఈ మహోన్నత అవధాన కార్యక్రమం జరగడం తన అదృష్టం అని కృతజ్ఞతాపూర్వకవందనాలు సమర్పించారు. జీవితానికి సరిపడా జ్ఞాపకాలను పోగు చేసుకొన్న మధురానుభూతులతో అమెరికా నలుమూలల నుండి వచ్చిన అభిమానులు, తెలుగువారు ఈ అమృతానందం మాకే సొంతం అని గర్వంగా టాంటెక్స్‌ నుండి మరొక ఆణిముత్యం ఈ కార్యక్రమం అని కొనియాడారు.
డా. మేడసాని మోహన్‌ను ఉత్తర అమెరికా తెలుగుసంఘం (తానా) అధ్యక్షులు శ్రీ జయశేఖర్ తాళ్ళూరి, టాంటెక్స్ అధ్యక్షుడు చినసత్యం వీర్నపు, ఉత్తరాధ్యక్షులు కృష్ణారెడ్డి కోడూరు, సాంబదొడ్డ మరియు తానా&టాంటెక్స్ కార్యవర్గ బృందం శాలువా, జ్ణాపిక ఇచ్చి ఘనంగా సత్కరించారు.
ఈ సభలోనే ఉన్న తానా అధ్యక్షులు జయశేఖర్ తాళ్ళూరిని టాంటెక్స్ మ‌రియు తానా కార్యవర్గసభ్యులు ఘనంగా సన్మానించింది.ఈ కార్యక్రమంలో తానా కార్యవర్గ బృందం డా. అడుసుమిల్లి రాజేష్, చలపతి కొండ్రకుంట, శ్రీకాంత్ పోలవరపు, దినేష్ త్రిపురనేని, సతిష్ కొమ్మన, రాజనల్లూరి, రవి అల్లూరి, శ్రీనివాస్ కొమ్మినేని, పరమేష్ దేవినేని, శేషారావుబొడ్డు, శివరావూరి, లోకేష్ నాయుడు కొణిదల, సుబ్బరావు కారసాల, శ్రీని మండువ, అనిల్ ఆరేపల్లి, డా. సి.ఆర్.రావు, డా. విశ్వనాధం పులిగండ్ల, సుగన్ చాగర్లమూడి, కె.సి. చేకూరి, ప్రకాశరావు వెలగపూడి,ఎం.వి.యల్.ప్రసాద్, టాంటెక్స్ పూర్య అధ్యక్షులు డా. ఊరిమిండి నరసింహారెడ్డి, సుబ్రమణ్యం జొన్నలగడ్డ, విజయ్ కాకర్ల, ఉత్తరాధ్యక్షులు కృష్ణారెడ్డి కోడూరు, ఉపాధ్యక్షులు పాలేటి లక్ష్మి, సంయుక్త కార్యదర్శి ప్రబంద తోపుదుర్తి, శ్రీకాంత్ జొన్నల, శరత్ ఎర్రంతో సహా ఎంతో మంది పుర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారికి, విజయవంతం కావడానికి సహకరించిన వివిధ కమిటీ సభ్యులకు, స్వచ్ఛంద కార్యకర్తలకు, టీవీ9, టీవీ5 మరియు ఇతర మీడియా ప్రతినిధులకు నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞ‌తలు తెలియజేశారు. డా. మేడసాని మోహన్ గారు తనకు జరిగిన ఘన సన్మానానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నిరాటంకంగా నాలుగు గంటల పాటు వందలాదిమంది సాహితీప్రియులు, తెలుగు భాషపై ఉన్న మమకారంతో ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడం తన జీవితంలో మర్చిపోలేని ఘటన అని ఉద్వేగభరితంగా అన్నారు.