బెంగాలీ సూపర్ స్టార్ షాకింగ్ మరణం..

August 13, 2020

బెంగాలీ సూపర్ స్టార్.. తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ తపస్ పాల్ అనూహ్య రీతిలో మరణించారు. ముంబయి నుంచి కోల్ కతాకు వెళ్లేందుకు ఎయిర్ పోర్టులో ఉన్న ఆయన.. ఉన్నట్లుండి కుప్పకూలిపోయారు. ఆ వెంటనే ఆయన్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూనే ఆయన మరణించారు. 1980-90లలో బెంగాలీ.. బాలీవుడ్ మూవీస్ లో నటించిన తపస్ కు రొమాంటిక్ హీరోగా గుర్తింపును తీసుకొచ్చాయి.
సినిమాల నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే తీరుకు తగ్గట్లే ఆయన కూడా రాజకీయాల్లోకి వచ్చారు. సొంతంగా పార్టీ పెట్టకుండా తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన.. అలీపూర్ నుంచి ఎమ్మెల్యేగా.. కృష్ణాపూర్ ఎంపీగా రెండుసార్లు గెలిచారు. రాజకీయాల్లో మంచి పట్టు సాధించిన ఆయన అనూహ్యంగా 2016లో రోజ్ వ్యాలీ చిట్ ఫండ్ కుంభకోణంలో ఇరుక్కున్నారు. ఈ ఇష్యూలోనే ఆయన్నుసీబీఐ అరెస్టు చేసింది.
దాదాపు జైల్లో 13 నెలలు ఉన్న ఆయన.. బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత నుంచి సినిమాలకు.. క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. తాజాగా ముంబయిలోని తన కుమార్తెను చూసేందుకు వచ్చిన ఆయన.. కోల్ కతాకు తిరిగివెళ్లేందుకు సోమవారం రాత్రి ఎయిర్ పోర్టుకు వచ్చారు.  విమానం కోసం వెయిట్ చేస్తున్న ఆయన ఉన్నట్లుండి కుప్పకూలిపోయారు. తపస్ పాల్ మరణంపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపాన్ని తెలిపారు. ఆయన మరణం తనకు షాక్ కలిగిందన్న ఆమె.. బెంగాలీ సినీ సూపర్ స్టార్.. తమ పార్టీ కుటుంబ సభ్యుడు లేని లోటును తీర్చటం సాధ్యం కాదన్నారు. బెంగాల్ సినీ సూపర్ స్టార్ మరణాన్ని బెంగాలీలు జీర్ణించుకోలేకపోతున్నారు.