తాప్సి.. చెంపపెట్టు లాంటి సమాధానం

July 14, 2020

బాలీవుడ్‌కు వెళ్లాక మంచి మంచి పాత్రలు చేస్తూ దూసుకెళ్తోంది తాప్సి పన్ను. అక్కడికెళ్లాక నటిగా ఆమె స్థాయి ఎంతో పెరిగింది. కంగనా రనౌత్ తర్వాత నటిగా అంత మంచి గుర్తింపుతో, ప్రత్యేక పాత్రలతో సాగిపోతున్నది తాప్సినే. ఐతే కంగనాతో ఈ పోలిక ఆమెకు లేని పోని తలనొప్పులూ తెచ్చి పెడుతోంది. తాప్సిని కంగనాతో పాటు ఆమె సోదరి రంగోలి అనవసరంగా టార్గెట్ చేసి ఇబ్బంది పెడుతున్నారు. ముఖ్యంగా రంగోలి అదే పనిగా తాప్సిని కెలుగుతోంది. కంగనాను కాపీ కొట్టి తాప్సి కెరీర్లో ఎదిగే ప్రయత్నం చేస్తోందని విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. అంతే కాక కంగనా లాగే తాప్సి కూడా ఉంగరాల జుట్టు పెంచుతోందని కూడా చీప్ కామెంట్ చేసింది. దీనికి ఇంతకుముందే తాప్సి సమాధానం చెప్పినా రంగోలి వదలట్లేదు. వివాదాన్ని ఇంకా పెద్దది చేసే ప్రయత్నం చేస్తోంది.

ఐతే తాప్సి ఎంత హుందాగా మాట్లాడినా... రంగోలి తీరు మారకపోవడంతో తాజాగా నేహా ధూపియా నిర్వహించే ఒక టాక్ షోలో ఈ అక్క చెల్లెల్లిద్దరికీ గట్టి పంచ్ విసిరింది తాప్సి. తన మీద కంగనా, రంగోలి చేసే విమర్శల గురించి ప్రస్తావించగా.. వాళ్లిద్దరికీ తనేంటో ఎంతో ప్రేమ అని అంది తాప్సి. అంత ప్రేమ ఉంది కాబట్టే ఎంతసేపూ తన గురించి ఆలోచిస్తారని.. తనను విమర్శిస్తారని అన్న తాప్సి.. తనకు మాత్రం వాళ్లిద్దరి మీద అసలేమాత్రం ప్రేమ లేదంది. అందుకే వాళ్లను పట్టించుకోవట్లేదని.. తనకు చాలా పని ఉంది కాబట్టి దాని మీదే దృష్టిపెడుతున్నానని అందీ సొట్టబుగ్గల సుందరి. మొత్తానికి కంగనా, రంగోలి పని లేకే తనను టార్గెట్ చేస్తున్నారంటూ గట్టిగానే ఇద్దరికీ పంచ్ ఇచ్చింది తాప్సి. దీనిపై రంగోలి ఏదో ఒక కామెంట్ చేయడం ఖాయం. అదేంటో చూడాలి. ఇదిలా ఉంటే.. నీతో పని చేసిన వరస్ట్ కోస్టార్స్ ఎవరని అడిగితే.. జాక్వెలిన్ ఫెర్నాండెజ్, విక్కీ కౌశల్ అంటూ ఆసక్తికర బదులిచ్చింది తాప్సి. అదేంటి అలా అన్నావ్ అంటే.. జాక్వెలిన్ లాగా అందంగా కనిపించడానికి, విక్కీలా నటించడానికి తాను చాలా కష్టపడాల్సి వచ్చిందని.. అందుకే వాళ్లను తన వరస్ట్ కోస్టార్స్‌గా భావిస్తానని ఆమె అంది.