తాప్సీ.. ఎవరిని టచ్ చేయకూడదో వారినే టచ్ చేసిందిగా?

May 26, 2020

కొందరిని కదిలించుకునే విషయంలో ఎవరూ ముందుకు రారు. అందరూ ఒకేలా ఉండరు కదా? కదిలించి కంప పెట్టుకోవటం ఎందుకులే అన్నట్లుగా తమ దారిన తాము ఉండిపోతుంటారు. అలాంటి వారిని టచ్ చేయాలంటే చాలానే గట్స్ ఉండాలి. అలాంటివి తనలో టన్నుల కొద్దీ ఉన్నాయన్న విషయాన్ని తాజాగా మరోసారి ఫ్రూవ్ చేశారు తాప్సీ పొన్ను. గ్లామర్ హీరోయిన్ గా కొద్ది సినిమాలు చేసినా.. తర్వాత మాత్రం తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకోవటమే కాదు.. కొన్ని పాత్రలు చేయాలంటే తాప్సీ మాత్రమే చేయాలన్న ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు.
స్క్రీన్ మీద నటనలో ఎంతలా చెలరేగిపోతారో.. ఆఫ్ స్క్రీన్ మీద కూడా మిగిలిన హీరోయిన్లకు కాస్త భిన్నంగా ఉంటారు తాప్సీ. కంగనా లాంటి ఫైర్ బ్రాండ్ తో పెట్టుకోవటానికి ఎవరూ ధైర్యం చేయని వేళ.. నేరుగా కంగనాకు కౌంటర్ ఇచ్చి సంచలనంగా మారిందీ ముద్దుగుమ్మ. స్టార్ హీరోయిన్ అయినప్పటికీ.. నోరు పారేసుకోవటంలో తనకు మించినోళ్లు లేరన్నట్లుగా వ్యవహరించే రీల్ క్వీన్ కు.. తాజాగా తన వ్యాఖ్యలతో షాకిచ్చింది తాప్సీ.
తన చిత్రాలకు చిత్రపరిశ్రమకు చెందినోళ్లు ఎవరూ సపోర్ట్ చేయరని వాపోయే కంగనాకు కాస్త గట్టిగానే కౌంటర్ ఇచ్చింది తాప్సీ. మహిళా ప్రాధాన్యం ఉన్న మిషన్ మంగల్ సినిమాకు కంగనా ఎందుకు మద్దతు తెలపరంటూ క్వశ్చన్ చేశారు. మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రాల గురించి మాట్లాడటానికి ఇష్టపడరంటూ ఈ మధ్యన కంగనా.. ఆమె సోదరి రంగోలీ అదే పనిగా తప్పు పట్టటం.. పలువురిపైన విమర్శలు చేయటం తెలిసిందే.
ఇలాంటివేళ.. తాప్సీతో పాటు మరో ఐదుగురు మహిళలు ప్రధాన పాత్రలుగా పోషించిన మిషన్ మంగళ్ ఈ వారం రిలీజ్ అయ్యింది. మహిళలు లీడ్ రోల్స్ ప్లే చేసిన సినిమాకు కంగనా ఎందుకని సపోర్ట్ చేయలేదంటూ తన వ్యాఖ్యలతో షాకిచ్చింది. వీలైనంతవరకూ కంగనాకు.. ఆమె నోట్లో పడటానికి ఇష్టపడని బాలీవుడ్ ప్రముఖులకు భిన్నంగా తాప్సీ ఆమెను టచ్ చేయటం హాట్ టాపిక్ గా మారింది.
తాప్సీ కంగనను కాపీ చేస్తుందని ఆమె సోదరి రంగోలీ ఈ మధ్యన విమర్శలు చేయటంపై పెద్దగా స్పందించని తాప్సీ తాజాగా సిస్టర్స్ ఇద్దరికి ఒకేసారి పంచ్ ఇచ్చేలా వ్యాఖ్యలు చేశారు. ‘ఓ మహిళ మరో మహిళకు మద్దతుగా ఉండాలని ఆమె (కంగన) ఎప్పుడూ చెబుతుంటుంది. మరి ఆమె నా సినిమాను (‘మిషన్‌ మంగళ్‌’)ను అభినందించినట్లు నాకు తెలియలేదు. ఈ సినిమాలో ఐదు మంది మహిళలు ఉన్నారు. మరి ఆమె మమ్మల్ని మెచ్చుకుందా? అంటూ క్వశ్చన్ చేసిన తాప్సీ.. ఆమెను తాను కాపీ కొడతానంటూ కంగనా సోదరి రంగోలీ వ్యాఖ్యలపైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆమె కంటే నేను జూనియర్ ని. ఆమెకున్న ఫిల్మోగ్రఫీ నాకు లేదు. అయినా.. ఇతరులు మెచ్చుకునే చిత్రాల్లో నటించానని చెప్పుకొచ్చారు. నటిగా తాను ఇష్టపడే కంగన తనపై వ్యాఖ్యలు చేయటం షాక్ కు గురైనట్లు చెప్పిన తాప్సీ.. నేను కంగనకు కాపీ అంటే సంతోషమే.. ఎందుకంటే ఆమె నాకంటే గొప్పనటి.. అందులోనూ అత్యధిక పారితోషికం తీసుకునే నటి కూడా అంటూ.. పొగుడుతూనే వేయాల్సిన అన్ని పంచ్ లు వేసేయటం గమనార్హం. గురి పెట్టి వదిలిన బాణాల్లా ఉన్న తాప్సీ పంచ్ లకు ఫైర్ బ్రాండ్ ఎలా రియాక్ట్ అవుతుందో?