టార్గెట్‌ బీజేపీ!

August 07, 2020
కమలనాథులపై జగన్‌ కన్నెర్ర
అవినీతిని ప్రస్తావిస్తే కన్నాపై ఆగ్రహం
చంద్రబాబుకు అమ్ముడుపోయారన్న విజయసాయి
అయినా స్పందించని బీజేపీ పెద్దలు
కేంద్ర స్థాయిలో కుమ్మక్కు వల్లే!
దిక్కుతోచని బీజేపీ రాష్ట్ర నేతలు
 

బీజేపీ జాతీయ నాయకత్వం, సీఎం జగన్మోహన్‌రెడ్డిల మైత్రీబంధం రానురాను పటిష్ఠమవుతోంది. అది ఎంతగానంటే.. తమ రాష్ట్ర నేతలను జగన్‌, విజయసాయిరెడ్డి తెగతిట్టిపోస్తున్నా.. బీజేపీ పెద్దలు కిక్కురుమనడం లేదు. ఓపక్క జనసేనతో కలిసి పటిష్ఠ ప్రతిపక్ష పోషించేందుకు రాష్ట్ర కమలనాథులు ప్రయత్నిస్తుంటే.. వారి ప్రయత్నాలపై ఎప్పటికప్పుడు నీళ్లు గుమ్మరిస్తోంది. ఇదే అదనపుగా జగన్‌ అండ్‌ కో బీజేపీ రాష్ట్ర నేతలను టార్గెట్‌ చేశారు.
 
మరీ ముఖ్యంగా రాష్ట్ర అఽధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పేరెత్తితే ఒంటికాలిపై లేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం.. రాజధాని అమరావతి నుంచి తరలించడం నుంచి విశాఖలో వైసీపీ నేతల భూదందాల  వరకు ఆయన పదేపదే ప్రస్తావిస్తుండడమే. తాజాగా కరోనా కాలంలోనే జగన్‌ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతున్న వైనాన్ని ఆయన బయటపెట్టారు. ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం కరోనా నిర్ధారణకు దక్షిణకొరియా నుంచి ఒక్కో ర్యాపిడ్‌ టెస్టు కిట్‌ను రూ.337కి కొనుగోలు చేయగా..
 
జగన్‌ సర్కారు దానికి రెట్టింపుపైనే అంటే.. రూ.730కి కొనుగోలుచేసింది. అది కూడా హైదరాబాద్‌కు చెందిన సండోర్‌ కంపెనీ ద్వారా రెండు లక్షల కిట్లకు ఆర్డర్‌ ఇచ్చారు. టీడీపీ నేతలు మరింత శోధించి సండోర్‌ కంపెనీకి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి లింకున్న విషయం బయటపెట్టారు. కన్నా విమర్శలు మరింత తీవ్రంగా ఉండడంతో జగన్‌ ఫైరయ్యారు.
 
అవినీతి ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి తన బంటు, ఏ-2 విజయసాయిరెడ్డిని రంగంలోకి దించారు. ఆయన విశాఖలో విలేకరుల సమావేశం పెట్టి కన్నాపై అడ్డగోలు ఆరోపణలు చేశారు. ఆయన చంద్రబాబుకు రూ.20 కోట్లకు అమ్ముడుపోయారని.. దీనికి తన వద్ద ఆధారాలున్నాయని అన్నారు. దీనిపై కన్నా విరుచుకుపడ్డారు. ప్రజల సొమ్మును కోట్లలో దిగమింగి జైలు కూడు తినివచ్చినవారు తనపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.
 
అయినా విజయసాయిరెడ్డి తగ్గకుండా తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. దీనిపై కాణిపాకం వినాయకుడి గుడిలో సాష్టాంగ ప్రమాణం చేయడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. అంతేగాక.. నిరుడు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అధిష్ఠానం రాష్ట్ర నాయకత్వానికి ఎన్ని నిధులు ఇచ్చింది..? అందులో గుంటూరు కోసం కన్నా ఎంత తీసుకున్నారు..? ఎవరెవరికి ఎంత ఇచ్చారు..? పురందేశ్వరి ఎంత తీసుకున్నారు..? నాయకత్వానికి చెప్పిన లెక్కలేమిటన్న వివరాలన్నీ తన వద్ద ఉన్నాయన్నారు.
 
ఇవన్నీ బీజేపీ అంతర్గత విషయాలైనపప్పటికీ కన్నా గురించి చెప్పడానికి ఈ మాటలు అంటున్నానన్నారు. అలాగే తెలుగుదేశాన్ని వీడి బీజేపీలో చేరిన ఎంపీ సుజనాచౌదరి కూడా ఎన్ని బినామీ కంపెనీలు పెట్టి, ఎన్ని బ్యాంకుల ద్వారా వేల కోట్ల రూపాయలు రుణాలుగా తీసుకొని ఎగ్గొట్టారో ఆడిటర్‌గా తన వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పారు. తమ నేతలపై ఇంత తీవ్ర ఆరోపణలు చేస్తే ఏ పార్టీ నాయకత్వమైనా ప్రత్యర్థులపై విరుచుకుపడుతుంది.
 
కానీ బీజేపీ పెద్దలు కిమ్మనలేదు. ఇంతకూ తమ అంతర్గత వ్యవహారాలు వైసీపీ నాయకత్వానికి ఎలా తెలిశాయా అని రాష్ట్ర కమలనాథులు ఆరా తీశారు. విజయసాయిరెడ్డితో రాసుకుపూసుకు తిరుగుతున్న బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై కన్నేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన్ను జగన్‌ బాగా మచ్చిక చేసుకుని.. విశాఖలోని ఓ భారీ హోటల్లో వాటా ఇచ్చారు.
 
దాంతో ఆయన ఎప్పుడు మీడియా మైకు ముందుకు వచ్చినా తన స్వామిభక్తిని రంగరించి మరీ ప్రదర్శిస్తున్నారు. రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించడాన్ని బీజేపీ రాష్ట్ర నేతలందరూ వ్యతిరేకిస్తుండగా.. జీవీఎల్‌ ఒక్కడే జగన్‌కు అనుకూలంగా మాట్లాడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. కేంద్రం కూడా రాజధాని తరలింపును వ్యతిరేకిస్తోందని కన్నా బృందం చెబుతుంటే.. కేంద్రానికి దీనితో సంబంధం లేదని ఆయన అంటున్నారు.
 
కానీ బీజేపీ పెద్దలు ఆయనపై చర్యల మాట అటుంచి.. రాష్ట్ర నాయకత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడవద్దని కనీసం సూచించడం లేదు. దీనిని అలుసుగా తీసుకుని జగన్‌ చెలరేగిపోతున్నారు. ఫలితంగా ర్యాపిడ్‌ కిట్ల కొనుగోలులో అవినీతి వ్యవహారం పక్కదోవ పట్టింది. జగన్‌ అవినీతిని, స్థానిక ఎన్నికల్లో దౌర్జన్యాలను, అక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రధాన ప్రతిపక్ష పాత్రను పోషించాలని తాము ఓపక్క ప్రయత్నిస్తుంటే..
 
జాతీయ నాయకత్వం తమను వెనక్కి లాగుతూ జగన్‌ను సమర్థిస్తుండడంతో రాష్ట్ర నాయకత్వానికి ఎటూ పాలుపోవడం లేదు. కేంద్ర పెద్దలు నవ్యాంధ్రపై ఆశలు వదులుకున్నట్లు కనిపిస్తోందని.. పవన్‌ కల్యాణ్‌ను జత కలుపుకొని తామెంత చేసినా.. అది టీడీపీకే లాభమని భావిస్తున్నట్లుగా ఉందని బీజేపీ రాష్ట్ర నాయకుడొకరు వ్యాఖ్యానించారు. అవినీతి సామ్రాట్‌లను వెనకేసుకొస్తే ప్రజల్లో పలచనవుతామన్న విషయం తమ నాయకత్వం విస్మరిస్తోందని వాపోయారు.
 
 
 

 

RELATED ARTICLES

  • No related artciles found