మిడిల్ క్లాస్ కి గుడ్ న్యూస్ చెబుతారా?

August 14, 2020

ప్రతి సంవత్సరం జనవరి వస్తే చాలు... సగటు భారతీయుడు గవర్నమెంటు వంక ఆశగా చూస్తాడు. మిగతావన్నీ ఇష్టానుసారం చేస్తారు. మాకు నేరుగా వర్తించేవి ఏవైనా గుడ్ న్యూస్ లు చెప్పకపోతారా అని ఆదుర్దా. అందునా అత్యంత ఆసక్తికరమైన అంశం ఐటీ శ్లాబు. శాలరీలు రూపురేఖలు 20 ఏళ్ల క్రితానికి ఇప్పటికి ఎంతో మారినా... ఐటీ శ్లాబుల వ్యవహారం మాత్రం గొర్రెతోక బెత్తెడు అన్నంత చందంగానే ఉంది. ద్రవ్యోల్బణ పెరుగుదలతో పాటు ఇవి పెరగకపోవడంతో... తగినంత ఆదాయం రానివాడు కూడా టాక్సు కట్టాల్సిన పరిస్థితి. ఇక ఈసారి ఆర్థిక మాంద్యం ఎఫెక్టుతో పరువు పోగొట్టుకున్న కేంద్రం... గుడ్ న్యూస్ చెప్పి కూల్ చేసే ప్రయత్నం జరుగుతోందని చెబుతున్నారు. 

2020-21 బడ్జెట్ మరో వారం రోజుల్లో ప్రవేశపెట్టనున్నారు. బ‌డ్జెట్ క‌స‌ర‌త్తు  వేగంగా జ‌రుగుతోంది. 5 లక్షలు దాటితే ఏకంగా 20 శాతం పన్ను వేస్తున్నారు. ఇక నుంచి అది ఉండకపోవచ్చు అంటున్నారు.  ప్రస్తుతం రూ.2.5 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి ఎలాంటి పన్నులు లేవు.  2.5 లక్షల నుంచి 5 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారికి 5 శాతం పన్ను విధిస్తున్నారు.  5 లోపు ఉన్న వారికి మాత్రం ఆఫర్ కింద ఈ పన్ను వేయరు.  ఈ 5 శాతం శ్లాబును రూ.7 లక్షలకు పొడిగించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సంకేతాలు వస్తున్నాయి. ఆఫర్ సంగతి తెలియడం లేదు.  రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షలదాకా 10 శాతం పన్ను విదించే అవకాశం ఉందంటున్నారు. రూ.10 లక్షల నుంచి 20 లక్షల వరకు వార్షిక ఆదాయముంటే 20 శాతం పన్ను, రూ.20 లక్షల నుంచి 10 కోట్ల మధ్య 30 శాతం పన్ను ఉండొచ్చంటున్నారు.