వైసీపీ నేతల కెపాసిటీ ఏంటో బయటపెట్టిన బాబు

July 05, 2020

1200 రూపాయలకు దొరికే ఇసుకలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన వైసీపీ నేతలు 10 వేలు రూపాయల వరకు ఇసుక ధరను తీసుకెళ్తే నిజాయితీ పరులం అని బిల్డప్ ఇస్తున్నారంటూ... వాళ్లు నిజంగా ఇసుక నుంచి తైలాన్ని తీయగలిగిన సమర్థులు అంటూ చంద్రబాబు వైసీపీ నేతలపై వ్యంగాస్త్రాలు వేశారు. ఒక్క పనికిమాలిన నిర్ణయంతో 20 లక్షల మందిని పస్తులుంటే బ్రహ్మాండమైన రికార్డు ఆ పార్టీ సొంతం చేసుకుందని చంద్రబాబు ఆరోపించారు. 

శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక అలభ్యతపై తెలుగుదేశం పార్టీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఉపాధి కోల్పోయిన నిర్మాణ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసనలు విజయవంతం అయ్యాయి. ప్రభుత్వ అనాలోచిత, అసమర్థ నిర్ణయం కారణంగా వారు అన్యాయమైపోయిన తీరుపై ప్రభుత్వాన్ని చంద్రబాబు కడిగిపారేశారు. తుగ్లక్ పాలనతో ప్రజల జీవితాలు నడిరోడ్డున పడ్డాయని చంద్రబాబు విమర్శించారు. మూడు నెలలుగా ఉపాధి కోల్పోయిన కార్మికులకు కుటుంబానికి 60 వేల చొప్పున ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. 

తెలుగుదేశం హయాంలో ఇసుక 1200 కు వస్తే , ఇపుడు పది వేలు అయ్యిందని... దీంతో ఇంటి నిర్మాణ ఖరీదు విపరీతంగా పెరిగిందన్నారు. సిమెంటు కంటే ఇసుక ధర ఎక్కువుండటాన్ని బట్టి  ఈ పాలన ఎంత అసమర్థంగా ఉందో అర్థమవుతుందన్నారు. సిమెంట్ పై జె- టాక్స్ వేసే వ్యూహంతో సృష్టించిన కృత్రిమ కొరతగా చంద్రబాబు దీనిని అభివర్ణించారు. మాకు 40 శాతం ఓట్లువేసి ప్రజలు మావైపు నిలబడ్డారు. ప్రజల వైపు నిలబడి వారి రుణం మేము తీర్చుకుంటాం అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 

దీనిపై మంగళగిరిలో నిరసనల్లో పాల్గొన్న లోకేష్ ఉదయం మీడియాతో మాట్లాడారు. సాయంత్రం ట్విట్టరులో కూడా స్పందించారు. తుగ్లక్ పాలన ఫలితంగా మూడు నెలల నుంచి పనుల్లేక పూట గడవటం కోసం అప్పులు చేస్తూ నెట్టుకొస్తున్న భవన నిర్మాణ కార్మికులకు ఒక్కో కుటుంబానికి రూ.60 వేల ఆర్థిక సాయం చేయాలి. వెంటనే ఇసుకను అందుబాటులోకి తేవాలి. ఇప్పటి వరకు తిన్నది చాలు. ఇకనైనా పేదలను బతకనివ్వండి. తెదేపా ఉద్యమాన్ని నీరుగార్చడానికి ప్రభుత్వం నాయకులను అరెస్టు చేయించింది. గృహ నిర్బంధాలు చేసింది. సోషల్ మీడియాలో అపహాస్యం చేసేందుకు ఫేక్ ప్రచారంతో కుట్ర చేసింది. అయినా పేదలకు అండగా చేసిన ఉద్యమం విజయవంతమయ్యింది. ఎందుకంటే ఇది అసలైన ప్రజాగ్రహం.... అంటూ ట్వీట్ చేశారు నారా లోకేష్.