బీసీ నేత కొల్లు రవీంద్ర అరెస్టు

August 07, 2020

తెలుగుదేశం నాయకుల​ను జైలుకు పంపడమే లక్ష్యంగా సాగుతున్న ఉద్యమంలో మరొక నేతపై కేసు నమోదైంది. కేసు నమోదైన 24 గంటల్లోపు పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. ఆయన ఎవరో కాదు... మాజీ మంత్రి కొల్లు రవీంద్ర.​మంత్రి పేర్ని నాని అనుచరుడు మోకా భాస్కరరావు హత్యకేసులో పోలీసులు మాజీమంత్రి కొల్లు రవీంద్ర పై 109 సెక్షన్ కింద కేసు నమోదు చే​సిన విషయం తెలిసిందే.

​తుని మండలం సీతారాంపురం జాతీయ రహదారి పై మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ను పోలీసులు అరెస్టు చేశారు. విశాఖ వైపు వెళ్తున్న కొల్లు రవీంద్ర ను మధ్యలో పోలీసులు ఆపి అరెస్టు చేశారు. అనంతరం ఆయనను తుని నుండి విజయవాడ కు తరలించారు.  కొల్లు రవీంద్రను రేపు పోలీసులు విచారించనున్నట్టు సమాచారం అందుతోంది. 
ఇప్పటికే ఈ కేసులో అరెస్టైన ముగ్గురు నిందితులను పోలీసులు విచారించారు. పోలీసు విచారణలో తెలిసిన సమాచారం ఆధారంగా రవీంద్రపై కేసు పెట్టినట్టు పోలీసులు చెబుతున్నారు.
కాగా బీసీ నేతలను అక్రమ కేసుల్లో ఇరికించి అణగదొక్కడానికే ఈ అరెస్టులు చేస్తున్నారని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆరోపించారు.