టీడీపీ జెండా తీయమన్నందుకు ఇల్లు ఖాళీ చేసిందీమె

May 22, 2020

వినేందుకు విచిత్రంగా అనిపించినా ఇది నిజం. పార్టీల మీద అభిమానం హ‌ద్దులు దాటేసి.. వ్య‌క్తిగ‌త స్థాయిల వ‌ర‌కూ ఎప్పుడో వెళ్లిపోయింది. అదెంత ఎక్కువ‌గా ఉందో తాజా ఉదంతం పెద్ద ఉదాహ‌ర‌న‌గా చెప్పాలి. ఒక పార్టీని అభిమానించి.. ఆ పార్టీ త‌ర‌ఫున ప్ర‌చారం చేసిన ఒక మ‌హిళ‌ను స‌ద‌రు ఇంటి య‌జ‌మాని నిలదీయ‌ట‌మే కాదు.. పెట్టుకున్న టోపీ.. ప‌ట్టుకున్న పార్టీ జెండా బ‌య‌ట ప‌డేస్తే కానీ ఇంట్లోకి అనుమ‌తించ‌మ‌న్న తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
య‌జ‌మాని తీరుకు స‌ద‌రు మ‌హిళ అంతే ధీటుగా బ‌దులివ్వ‌ట‌మే కాదు.. ఇలాంటి కండిష‌న్లు పెడితే ఇల్లు ఖాళీ చేస్తాన‌ని చెప్పి.. రోడ్డు మీద ఉండేందుకు సైతం వెనుకాడ‌ని తీరు ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. మీడియాలోనూ.. సోష‌ల్ మీడియాలో ప్ర‌ముఖంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే.. ఏపీ ముఖ్య‌మంత్రి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న సంచ‌ల‌నంగా మారింది.
కుప్పంలోని శాంతిపురం మండ‌ల ప‌రిధి న‌డింప‌ల్లెకు చెందిన వ‌సంత‌మ్మ వీర టీడీపీ అభిమాని. ఒంట‌రి మ‌హిళ అయిన ఆమె ఒక్క‌తే అద్దె ఇంట్లో ఉంటోంది. టీడీపీ స‌భ్య‌త్వం ఉన్న ఆమె.. ఎన్టీఆర్ భ‌రోసా ఫించ‌న్ పొందుతోంది. కూలి ప‌నులు చేసుకుంటూ జీవిస్తోంది. ఆదివారం రాత్రి టీడీపీ త‌ర‌ఫున ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొని రాత్రి ఇంటికి వెళ్లింది.
అయితే.. ఆమె టీడీపీ కండువా.. టోపీ పెట్టుకొని త‌న ఇంట్లోకి రావొద్ద‌ని.. వాటిని దూరంగా ప‌డేయాల‌ని ఇంటి య‌జ‌మాని కండీష‌న్ పెట్టార‌ట‌. దీంతో.. ఒళ్లు మండిన వ‌సంత‌మ్మ అర్థ‌రాత్రి అన్న విష‌యం కూడా పట్టించుకోకుండా అప్ప‌టిక‌ప్పుడు ఆమె ఇంటిని ఖాళీ చేసింది. త‌న ఇంట్లోని సామాన్ల‌ను ప‌రిచ‌య‌స్తుల సాయంతో వేరే ఇంటికి త‌ర‌లించి.. స్థానికంగా ఉండే ఒక టీడీపీ నేత ఇంట్లో ఉంటోంది. రోడ్డు మీద అయినా ఉంటాను కానీ టీడీపీ టోపీ పెట్టుకోవ‌ద్ద‌న‌టానికి నువ్వెవ‌రు? అన్న వ‌సంత‌మ్మ క‌మిట్ మెంట్ తెలుగు త‌మ్ముళ్లతో పాటు టీడీపీ అధినేతకు తెలిస్తే బాగుంటుంది.