ఎన్నెన్నో దెబ్బలు... కరోనాకు టీడీపీ భయపడుతుందా?

June 05, 2020

తెలుగు దేశం పార్టీ... తెలుగు ప్రజల  ఆత్మ గౌరవ పరిరక్షణే లక్ష్యంగా పురుడు పోసుకున్న పార్టీ. 40 దశాబ్దాల ప్రస్థానాన్ని త్వరలోనే ముగించుకోనున్న టీడీపీకి ఇప్పుడు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. అటు రాజకీయంగానే కాకుండా... ఇటు రాజకీయేతర పరిణామాలు కూడా పార్టీని నానా ఇబ్బందులు పెట్టేస్తున్నాయి. ఇలాంటి క్రమంలో టీడీపీ కాకుండా... ఇంకో పార్టీ అయితే చాప చెట్టేయక తప్పదు. అయితే స్వర్గీయ నందమూరి తారకరామారావు అకుంఠిత దీక్షతో పురుడు పోసుకున్న టీడీపీ... ఈ తరహా చిన్నా, చితకా పరిణామాలకు, దెబ్బలకు వణికిపోయే రకం కాదు కదా. అందుకే... రాజకీయంగా గతంలో ఎన్నడూ తగలనంత దెబ్బ తగిలినా... తట్టుకుని నిలబడిన టీడీపీ...ఇప్పుడు ప్రాణాంతక వైరస్ కరోనా విజృంభిస్తున్న వేళ తన ఆవిర్భావ వేడుకలను ఆదివారం సరికొత్త రీతిలో నిర్వహించుకుంది.

 

కరోనా వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో దేశం మొత్తం లాక్ డౌన్ లోకి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఏడాది టీడీపీ ఆవిర్భావ వేడుకలు జరగవేమోనన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే... 37 ఏళ్లుగా ఆవిర్భావ వేడుకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వ్యవహారాన్ని నడుపుతున్న పార్టీ అధిష్ఠానం... ఈ దఫా కూడా వేడులకు చెల్లుచీటి ఇవ్వాల్సిన అవసరం లేకుండా వ్యూహాన్ని రచించింది. ఇందులో భాగంగా కరోనా కట్టడి కోసం భారత ప్రభుత్వం ఇచ్చిన లాక్ డౌన్ పిలుపునకు ఓ వైపు సంఘీభావం తెలుపుతూనే.. మరోవైపు పార్టీ ఆవిర్భావ వేడుకలను ఎవరి ఇళ్లల్లో వారే నిర్వహించాలని పార్టీ అదినేత నారా చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. 

 

కరోనా మహమ్మారి గురించి భయాందోళనలు నెలకొన్న వేళ... చంద్రబాబు నుంచి వచ్చిన ఈ పిలుపు బాగానే పనిచేసింది. పార్టీ అధినేత హోదాలో చంద్రబాబు... హైదరాబాద్ లోని తన సొంతింటిలో పార్టీ జెండాను ఎగురవేసి ఆవిర్భావ వేడుకలను నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు కుమారుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణితో పాటు చంద్రబాబు మనవడు నారా దేవాన్ష్ పాల్గొన్నారు. ఓ వైపు చంద్రబాబు ఇంటిలో పార్టీ జెండాను ఆవిష్కరిస్తున్న సమయంలోనే రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలందరి ఇంటా పార్టీ ఆవిర్భావ వేడుకలు మిన్నంటాయి.

 

మొత్తంగా ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొన్న చరిత్ర కలిగిన టీడీపీ... ఎన్నో ఆటుపోట్లను కూడా తట్టుకుని నిలబడింది. ఈ క్రమంలో మొన్నటి ఎన్నికల్లో పార్టీకి ఘోర పరాభవం ఎదురవడం, ఆ తర్వాత పార్టీలోని చాలా మంది నేతలు అధికార పార్టీలోకి చేరిపోతుండటం, ఇంకోవైపు అధికార పార్టీ వైసీపీ నుంచి ఎదురవుతున్న ఇబ్బందులు... మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా ఇప్పుడు కరోనా నిర్బంధంతో ఈ దఫా టీడీపీ ఆవిర్భా వేడుకలు జరగవేమోనన్న అనుమానాలు నెలకొన్నాయి. అయితే వాటన్నింటిని తుత్తునీయలు చేసిన చంద్రబాబు... ఇంటింటా టీడీపీ జెండాల రెపరెపలు ఎగిరేలా పార్టీ ఆవిర్భావ వేడుకలను మునుపెన్నడూ లేనంత రీతిలో ఘనంగా నిర్వహించారని చెప్పాలి.