టీడీపీకి మరోసారి ఛాన్స్ ఇచ్చిన వైసీపీ

July 05, 2020

సెల్ఫ్ గోల్స్ వేసుకోవడంలో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డికి మించిన వాళ్లు ఉండరు. రాష్ట్రంలో కొంత బలం పుంజుకుంటున్నామన్న సమయంలో ఆయన ఏదో పని చేసి వైసీపీకి నష్టం చేకూర్చుకుంటున్నారు. ఇది అధికార తెలుగుదేశం పార్టీకి బాగా కలిసొస్తుంది. ఇప్పటికే ఇలా చాలా సార్లు జరిగింది కూడా. ప్రస్తుతం రాష్ట్రంలో కీలక సమయం నడుస్తోంది. ఎన్నికలకు ఇంక పది రోజుల సమయం మాత్రమే ఉండడంతో అన్ని పార్టీలు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే రాష్ట్రంలోని చాలా పార్టీలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. కానీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇవేమీ పట్టవన్నట్లుగా ముందుకు వెళ్తోంది. ఎన్నికల ముంగిట వైసీపీ అధిష్ఠానం వ్యవహరిస్తున్న తీరు ఆ పార్టీకి నష్టం చేకూర్చడంతో పాటు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మారుతోంది. రెండు రోజుల క్రితం జరిగిన పరిణామమే దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి యువనేస్తం పథకం కింద భృతి ఇస్తున్న విషయం తెలిసిందే. దీనిని ప్రారంభంలో రూ. 1000గా నిర్ణయించారు. అదే మొత్తాన్ని వాళ్ల ఖాతాలో కూడా జమ చేశారు. అయితే, గత ఫిబ్రవరి నుంచి రూ.2000కు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ, అప్పటికే ఏడు జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో, మిగిలిన ఆరు జిల్లాల్లో మాత్రమే ఈ పెరుగుదల వర్తించింది. కోడ్‌ ముగిశాక ఆ ఏడు జిల్లాలకు పెంపు అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ముగియడంతో ఆ ఏడు జిల్లాల్లోనూ నిరుద్యోగ భృతి పెంపు అమలుకు ఎన్నికల కమిషన్‌ అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఇది ఇప్పటికే అమల్లో ఉన్న పథకం కాబట్టి అనుమతి ఇవ్వాలని కోరింది. అయితే, ఈ ప్రతిపాదనను ఈసీ తోసిపుచ్చింది. సార్వత్రిక ఎన్నికలు అయ్యే వరకు ఆ ఏడు జిల్లాల్లో పెంచిన మొత్తం ఇవ్వడానికి వీల్లేదని ఇటీవల తేల్చిచెప్పింది.

ఇప్పుడిదే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మారింది. దీనికి కారణం ఈ నిర్ణయం ప్రకటించడానికి ముందే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వైవీ సుబ్బారెడ్డి, బొత్సా సత్యనారాయణలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. కొద్దిరోజుల క్రితం రెండు జిల్లాలకు చెందిన ఎస్పీలతో పాటు ఐబీ చీఫ్‌ను ఎన్నికల విధుల నుంచి తప్పించింది ఈసీ. దీనిపై ఈసీ చర్యలు తమను సంతృప్తి పరచలేదని, గతంలో తాము ఫిర్యాదు చేసిన విధంగా డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ను, సీనియర్‌ అధికారులు ఘట్టమనేని శ్రీనివాస్‌, యోగానంద్‌తో పాటు చిత్తూరు, ప్రకాశం, విజయనగరం, గుంటూరు రూరల్‌ ఎస్పీలను కూడా బదిలీ చేయాలని వైసీపీ కోరింది. ఇందుకోసమే వైసీపీ నేతలు ఢిల్లీ వెళ్లారని ఆ పార్టీ నేతలు చెప్పుకొచ్చారు. అయితే, ఇదే సమయంలో నిరుద్యోగ భృతి పెంపు విషయాన్ని కూడా వాళ్లు ఈసీ దృష్టికి తెచ్చినట్లు తెలిసింది. అందుకే ఈసీ భృతి పెంపునకు నిరాకరించినట్లు చెప్పుకుంటున్నారు. ఇది చెప్పుకుని టీడీపీ నేతలు ప్రచారం చేసుకుంటే వైసీపీకి మరో దెబ్బ తగలడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది.