జగన్‌కు గిఫ్టు పంపిన టీడీపీ నేత.. ఏంటో తెలుసా?

July 16, 2020

రాజధాని మార్పును వ్యతిరేకిస్తూ టీడీపీ విమర్శలు, కార్యక్రమాల జోరు పెంచిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ పార్టీ నేత ఒకరు వినూత్న రీతిలో నిరసన తెలిపి ఏపీ సీఎం జగన్‌కు షాకిచ్చారు. రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా ఆయనకు కనిపించడం లేదు, వినిపించడం లేదు అంటూ కళ్లద్దాలు, చెవిటి మిషన్‌ను ఆయనకు పంపించారు. టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఈ పని చేశారు. అమరావతి రైతుల పట్ల జగన్ నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తున్నారని ఆయన ఈ సందర్భంగా మండిపడ్డారు.
'నేనున్నాను... నేను విన్నాను' అని చెప్పి గద్దెనెక్కిన జగన్‌కు గత 22 రోజులుగా రైతులు ఆందోళన చేస్తుంటే కనిపించలేదా.. వినిపించలేదా అని ఆయన ప్రశ్నించారు. రైతులు ఆందోళన చేస్తుంటే ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? అని ఆయన విరుచుకుపడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఉన్న ప్రేమ సొంత రాష్ట్ర ప్రజలపై లేదా? అని వెంకన్న ప్రశ్నించారు. అమరావతి రైతుల గుండెకోత మీకు వినపడటం లేదా? అని మండిపడ్డారు. అన్ని వసతులు ఉన్న అమరావతిని మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. టీడీపీ కార్యకర్తల అంతు చూస్తామన్న మంత్రులపై డీజీపీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. తమ కార్యకర్తలపై దాడి చేస్తే సహించబోమని హెచ్చరించారు.
పనిలోపనిగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపైనా బుద్ధా వెంకన్న ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించారు. 'విజయసాయిరెడ్డి గారు.. ముఖ్యమంత్రి జగన్ గారు చేతగాని వాడు అని మీరే ప్రపంచానికి చాటింపు వేసి మరీ చెబుతున్నారు. అమరావతిని చంపడానికి మీరు, జగన్ గారు చేసిన ఆరోపణలు ఒక్కటైనా నిరూపించారా? ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటున్నారు ఒక్క ఆధారమైనా చూపించారా?' అని ప్రశ్నించారు. 'మగాడిలా చంద్రబాబు గారు ఛాలెంజ్ చేశారు. సవాలు స్వీకరించే దమ్ము మీకు లేదు. జ్యూడిషియల్ విచారణ చేసే సత్తా లేదు ట్విట్టర్ లో విసుర్లు ఎందుకు సాయి రెడ్డి గారు? డైరెక్ట్ గా చర్చించుకుందాం రా.. బినామీలు, సొంత మనుషులు కథ ఏంటో తేల్చుకుందాం' అని బుద్ధా వెంకన్న సవాలు విసిరారు.

Read Also

రాజధాని అమరావతి పరిరక్షణ సమితి జెఏసికి ఎకరం భూమి విరాళం
అమరావతి ఉద్యమం ఇలా అయితే ఎలా?
ఒకే రాష్ట్రం ఒక్క రాజధాని మాత్రమే