జగన్ మూర్ఖత్వంపై ఆయనేమన్నారంటే..

February 25, 2020

రాజధాని మార్చాలనే విషయంలో ఎవరెన్ని చెప్పినా, ఎంత వ్యతిరేకత వస్తున్నా కూడా తాను అనుకున్నదే చేయడానికి సిద్ధమవుతున్న సీఎం జగన్‌పై టీడీపీ నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. టీడీపీ నేతలు, పలువురు మాజీ మంత్రులు కూడా జగన్ నిర్ణయాన్ని తప్పు పడుతున్నారు. కాగా... మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు తాజాగా దీనిపై స్పందిస్తూ జగన్ మూర్ఖంగా ముందుకు సాగుతున్నారని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటే తప్ప జగన్ మూర్ఖత్వపు నిర్ణయాలు ఆగవని వడ్డే అన్నారు. హైకోర్టు ఉత్తర్వులు కాదని కర్నూలుకు కార్యాలయాలను తరలించడమేంటని ప్రశ్నించారు. విశాఖలో భూములు కొన్నవారు లాభపడేందుకే రాజధానిని తరలిస్తున్నారా? అని ప్రశ్నించారు. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని భావిస్తే కనుక సీబీఐతో విచారణ జరిపించాలని వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కాగా రాజధాని మార్పును కేంద్రం అంత సులభంగా ఒప్పుకునే పరిస్థితి లేదని ఆయన అభిప్రాయపడ్డారు. రాజధానిని తరలించవద్దని నిరసనలు చేస్తున్న రైతులు, మహిళలపై పోలీసులు ప్రవర్తించిన తీరుపై ఆయన మండిపడ్డారు.
మరొవైపు వడ్డే శోభనాద్రీశ్వరరావు అంటున్నట్లుగానే కేంద్రం వైపు నుంచి జగన్ నిర్ణయానికి మద్దతు దొరికే పరిస్థితి కనిపించడం లేదన్న మాట దిల్లీ రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది. తాజాగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కూడా తమకు రాజధాని మార్పు గురించి రాష్ట్రం నుంచి ఎలాంటి సమాచారం లేదని.. సమాచారం వస్తే అప్పుడు రాజ్యాంగపరంగా దానిపై స్పందిస్తామని అన్నారు.