వైసీపీ నోరు మూయించిన టీడీపీ లీడర్

July 05, 2020

నారా లోకేశ్‌ను పప్పు అంటూ చాలాకాలంగా వైసీపీ, ఇతర కొన్ని పార్టీల నేతలు ఎగతాళి చేస్తారన్న సంగతి తెలిసిందే. ఇటీవల రాంగోపాల్ వర్మ కమ్మరాజ్యంలో కడప రెడ్లు ట్రయలర్లలోనూ నారా లోకేశ్ పాత్రకు చంద్రబాబు పాత్ర పప్పు వడ్డిస్తున్నట్లుగా ఉన్న సన్నివేశాలను సోషల్ మీడియాలో రిలీజ్ చేసి సెటైర్ వేశారు. మరోవైపు వైసీపీ నేతలు కూడా లోకేశ్ ను పప్పు అంటూ సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. ఈ పప్పు అనే మాటను టీడీపీ వర్గాలు బలంగా తిప్పి కొట్టలేకపోతున్నాయి. అయితే.. తాజాగా ఆ పార్టీకి చెందిన నాయకుడొకరు ఈ విమర్శలను తెలివిగా తిప్పికొట్టడంతో అదే లైన్‌ను టీడీపీ నేతలంతా అందుకోవాలని.. లోకేశ్ పై పప్పు అనే కామెంట్లు వస్తే తిప్పికొట్టాలని సూచిస్తున్నారు.
తెలుగుదేశం నేత పిల్లి మాణిక్యాలరావు ఈ రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ‘పప్పు’ కంటే చిప్పకూడు దారుణమైందని అన్నారు. చిప్పకూడు తినడం కంటే భాష రాకపోవడం పెద్ద తప్పేమీ కాదంటూ పరోక్షంగా జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ కొంతకాలం జైలులో ఉండి రావడంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మంత్రి  కొడాలి నానికి ఓ హెచ్చరిక చేశారు. రాష్ట్ర ప్రజలకు సన్నబియ్యం ఇస్తామన్న హామీ గురించి తమ నాయకుడు ఒకరు ప్రస్తావిస్తే.. నాని బూతుల పురాణం మాట్లాడారని, ఓ రౌడీలా ప్రవర్తించారని మండిపడ్డారు. ఒక వ్యక్తి ప్రశ్నిస్తేనే నాని ఇలా మాట్లాడారే, రేపు రాష్ట్ర ప్రజలందరూ ఈ హామీ విషయమై నిలదీస్తే ఇదే బూతుపురాణం మాట్లాడతారా? అని ప్రశ్నించారు. ఇదే విధంగా ప్రజలతో మాట్లాడతానంటే బట్టలూడదీసి తంతారన్న సంగతిని నాని గుర్తుపెట్టుకోవాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంత్రిగా కొనసాగాలనుకుంటే నీ భాష, బాడీ లాంగ్వేజ్ మార్చుకోకపోతే, తగిన మూల్యం చెల్లించే రోజు తొందర్లోనే వుంది’ అని హెచ్చరించారు.
ఏపీలో మంత్రులు మాట్లాడే భాషపై మాణిక్యాలరావు మండిపడ్డారు. ‘బుల్లెట్ దిగిందా? లేదా?’ అని ఒక మంత్రి, ‘నీయబ్బ సొత్తా?’.. అని మరో మంత్రి అంటారు. వాళ్లను బూతుల శాఖలకు మంత్రులుగా చేస్తే బాగుంటుంది సీఎంగారూ అంటూ ఆయన సెటైర్ వేశారు.