ఆ నలుగురు జంప్... ఏ టీడీపీ నేత ఏం కామెంట్ చేశారు?

July 01, 2020

ఏపీ రాజకీయాల్లో పెను కలకలం రేపుతూ... టీడీపీకి చెందిన నలుగురు రాజ్యస సభ్యులు వై.సుజనా చౌదరి, సీఎం రమేశ్, గరికపాటి మోహన్ రావు, టీజీ వెంకటేశ్ లు బీజేపీలో చేరిపోయారు. తాజా ఎన్నికల్లో పార్టీ ఓటమిపాలు కాగా... కష్టకాలంలో పార్టీకి అండగా నిలవాల్సిన వారు ఇలా మూకుమ్మడిగా పార్టీని వీడటంపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీలో కీలక నేతలుగా ఎదిగిన ఈ నలుగురు పార్టీకి కష్టాలు ఎదురైన సమయంలో అవకాశవాదులుగా మారి పార్టీని వీడటంపై నిజంగానే టీడీపీ నేతల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ఈ క్రమంలో పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు ఈ జంపింగ్ రాయుళ్లపై తమదైన శైలిలో విరుచుకుపడ్డారు.

చంద్రబాబునాయుడు : సంక్షోభాలు పార్టీకి కొత్త కాదని, కార్యకర్తలెవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. టీడీపీ ఎంపీలు బీజేపీలో చేరడంపై విదేశీ పర్యటనలో ఉన్న ఆయన స్పందించారు. సీనియర్‌ నేతలతో మాట్లాడారు. కొందరితో వీడియో కాన్ఫరెన్సులో కూడా మాట్లాడారు. బీజేపీతో ఉండాలనుకుంటే అలాగే కొనసాగాం. కానీ ఆంధ్రులకు ద్రోహం చేసిన పార్టీతో మా స్వార్థం కోసం ఉండలేకపోయాం. ప్రత్యేక హోదా, రాష్ట్ర ప్రయోజనాల కోసమే తెదేపా భాజపాతో పోరాడింది. భాజపా ఇలాంటి చర్యలకు పాల్పడటం అనైతికం. 

గౌరవం కల్పిస్తే... ద్రోహం చేశారు: రామ్మోహన్ నాయుడు
రాజకీయ హోదా, గౌరవం కల్పించిన పార్టీకి ద్రోహం చేయడం బాధాకరం. బీజేపీ ఫిరాయింపు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. మొన్న జరిగిన ఎన్నికల్లో టీడీపీకి నలభై శాతం ఓట్లు వచ్చాయి. పార్టీ బలహీనపడుతోందన్న ఆలోచన ఏ ఒక్కరికీ రాకూడదు. మా అజెండా కొనసాగిస్తామని, రాష్ట్ర అంశాలపై బలంగా పోరాడతాం. పార్టీ సిద్ధాంతాలను వదలుకోం, టీడీపీ తరపున పోరాటాలు కొనసాగిస్తాం. టీడీపీని బలోపేతం చేసే దిశగా కృషి చేస్తాం.

మూడ్ ఆఫ్ ద నేషన్ ఎలా అవుతుంది?: కనకమేడల
రాజ్యసభ చైర్మన్ కు టీడీపీ ఎంపీలు లేఖ ఇవ్వడం విచారించదగ్గ అంశం. గెలిచిన పార్టీలో చేరడం 'మూడ్ ఆఫ్ ద నేషన్' ఎలా అవుతంది?. టీడీపీ పార్లమెంటరీ పార్టీ లెటర్ హెడ్ తో లేఖ ఇచ్చారు. రాజ్యసభ చైర్మన్ కు ఇచ్చిన లేఖతో పార్టీకి సంబంధంలేదు. రాజ్యసభలో టీడీపీని బీజేపీలో విలీనం చేయడం కుదరదు., ఇది పార్టీ ఫిరాయింపుల కిందికే వస్తుంది. ఫిరాయింపులను ప్రోత్సహించడం బీజేపీకి తగదు. పదో షెడ్యూల్ ను తప్పుదోవ పట్టించడమే తప్ప, విలీనం సాధ్యం కాదు. కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన పనిలేదు. టీడీపీ మనుగడకు ఎలాంటి ప్రమాదం లేదు.

సొంత ప్రయోజనాల కోసమే: గల్లా జయదేవ్
ఆ నలుగురు సొంత ప్రయోజనాల కోసమే బీజేపీలో చేరారు. రాజ్యసభలో టీడీపీ పార్లమెంటరీ పార్టీని బీజేపీలో విలీనం చేయాలని కోరుతూ నలుగురు ఎంపీలు రాజ్యసభ చైర్మన్ కు లేఖ ఇచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు తెలియకుండా వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయమై న్యాయపరమైన అభిప్రాయం తీసుకుంటాం. తాజా ఎన్నికల్లో టీడీపీకి నలభై శాతం ఓట్లు వచ్చాయి. పార్లమెంటులో ప్రజల గొంతుకను వినిపిస్తాం.

సుజనా వ్యాఖ్యలు హాస్యాస్పదం: గద్దె
రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీ నుంచి బయటకు వెళ్లామన్న సుజనా చౌదరి వ్యాఖ్యలు హాస్యాస్పదం. సొంత ప్రయోజనాల కోసమే ఆ నలుగురు ఎంపీలు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీని నమ్మక ద్రోహం చేసి బీజేపీలో చేరారు. ప్రజా క్షేత్రంలో బలం లేని నేతలను బీజేపీలోకి తీసుకోవడం ద్వారా ఆ పార్టీ ఏం ఆశిస్తోందో అర్థం కావట్లేదు.

ఆ నలుగురు దద్దమ్మలు: బుద్ధా
పార్టీ మారిన ఎంపీలు చచ్చు దద్దమ్మలు. బీజేపీ ఎంపీ జీవీఎల్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వంటి నేతలు తాము నమ్ముకున్న పార్టీ కోసం నిలబడ్డారు. అధికారంలో లేకుండా వీరు నెల రోజులు కూడా పార్టీలో ఉండలేకపోయారు.

పిరికిపందలు: దేవినేని ఉమ
పార్టీ ఎన్నో సంక్షోభాలు చూసింది. ఈ ఎంపీలు మాత్రం పిరికిపందల్లా వ్యవహరించారు. సీఐడీ, ఈడీ కేసులకు భయపడి ఈ ఎంపీలు పార్టీని వీడారు. బీజేపీ కండువాలు కప్పుకున్నారని తూర్పారబట్టారు.

నేను మాత్రం వీడను: జేసీ
టీడీపీ మునిగిపోయే నావే అయినప్పటికీ నేను మాత్రం పార్టీని వీడబోను. ఇప్పటివరకు ఏ కార్యకర్తల మీటింగ్ పెట్టలేదు. ఏపీలో బీజేపీ బలోపేతం అవుతుందో, లేదో ఇప్పుడే చెప్పలేమని, మరో ఏడాది సమయం అవసరం. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, ఎన్నికల ఫలితాలు వచ్చాక, అందరికంటే ముందు జేసీనే బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం జరిగింది. ఆ వార్తలన్నీ అవాస్తవాలే.

ఒత్తిడికి గురై జంపయ్యారు: కాలవ
సుజనా చౌదరి, సీఎం రమేశ్ వంటి నేతలు చంద్రబాబుపై నమ్మకం కలిగినవారే అయినా, ఎన్నికల ఫలితాల అనంతరం తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. ఇంత తక్కువ సమయంలో పార్టీని వీడతారని అనుకోదు. చంద్రబాబు విదేశీ యాత్ర నుంచి వచ్చాక తెలుగుదేశం పార్టీ బలోపేతం చేయడంపై చర్చిస్తాం. టీడీపీకి ఇలాంటి సంక్షోభాలు కొత్తకాదు. పార్టీ ఈ కష్టాలను తట్టుకుని నిలబడుతుంది.