తమ్ముళ్లకు అవకాశాల్ని వాడుకోవడం రావట్లేదు

July 07, 2020

తెలుగు త‌మ్ముళ్ల వ్య‌వ‌హారం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. అధికారం ఉన్న‌ప్పుడు ఎవ‌రికి వారు ఎంజాయ్ చేసిన వారు.. అధికారం దూర‌మయ్యాక మాత్రం ప‌త్తా లేకుండా పోయిన ప‌రిస్థితి. ప‌దేళ్లు ప్ర‌తిప‌క్షంలో ఉండి అధికారంలోకి వ‌చ్చిన నేప‌థ్యంలో కాస్త ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన పాపానికి బాబుకు భారీ న‌ష్టం వాటిల్లింద‌న్న అభిప్రాయం ఉంది. పార్టీ నేత‌ల కోసం త‌పించిన చంద్ర‌బాబుకు ఇప్పుడు అండ‌గా నిలిచిన నేత‌ల్ని వేళ్ల మీద లెక్కించొచ్చు.
ఏపీ ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్‌ బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత చేస్తున్న కార్య‌క్ర‌మాల్లోని లోపాల్ని ఎత్తి చూపించే విష‌యంలో ఏ ఒక్క టీడీపీ నేత స‌మ‌ర్థంగా వ్య‌వ‌హ‌రించ‌టం లేద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. నెల రోజుల పాల‌న‌లో ల్యాండ్ మార్క్ నిర్ణ‌యాలు తీసుకొన్న‌ట్లుగా సాగుతున్న ప్ర‌చారంలో నిజం లేద‌న్న విష‌యాన్ని స‌మ‌ర్థ‌వంగా తిప్పి కొట్టే నేత‌లు క‌నిపించట్లేద‌న్న మాట టీడీపీ వ‌ర్గాల్లో వ్య‌క్త‌మ‌వుతోంది.
కొత్త ప్ర‌భుత్వం వ‌చ్చాక ఆర్నెల్లు టైం ఇచ్చే సంప్ర‌దాయ ధోర‌ణికి క‌ట్టుబ‌డి ఉండ‌టం త‌ప్పేం కాదు. కానీ.. అదే స‌మ‌యంలో అధికార‌ప‌క్షం సైతం పాల‌న మీద కాకుండా ప్ర‌తిప‌క్షం మీద ఫోక‌స్ చేసి.. వారిని పూర్తిగా దెబ్బ తీసేలా వ్య‌వ‌హ‌రిస్తున్న వేళ‌.. ఆర్నెల్ల గ్రేస్ పిరియ‌డ్ ఇవ్వాల్సిన అవ‌స‌రం లేద‌న్నది మ‌ర్చిపోకూడ‌దు.
అబ‌ద్ధాల‌ను నిజాలుగా ప్ర‌చారం చేసుకుంటూ మైలేజీ పొందుతున్న వేళ‌.. వాటిని తిప్పికొట్టాల్సిన బాధ్య‌త ఉంది. కానీ.. ఆ విష‌యంలో తెలుగు త‌మ్ముళ్లు దారుణంగా ఫెయిల్ అయ్యార‌ని చెప్పక‌త‌ప్ప‌దు. వ్య‌వ‌సాయ సీజ‌న్లో రైతుల‌కు అత్యంత అవ‌స‌ర‌మైన విత్త‌నాల్ని ఇవ్వ‌లేని విష‌యంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఫెయిల్ అయ్యింద‌న్న విష‌యాన్ని టీడీపీ నేత‌లు ఎవ‌రూ ఎఫెక్టివ్ గా చెప్ప‌లేదు. విత్త‌నాల కోసం రోడ్లు ఎక్కే ప‌రిస్థితికి తీసుకురావ‌టంతో పాటు.. లాఠీ చార్జి జ‌రిపే వ‌ర‌కూ వెళ్లినప్ప‌టికీ.. ఆ వైఫ‌ల్యాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లే విష‌యంలో టీడీపీ నేత‌లు విఫ‌ల‌మ‌య్యారని చెప్పాలి.
2014లో టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన‌ప్పుడు విద్యుత్ కొర‌త భారీగా ఉండేది. దాదాపు 22 మిలియ‌న్ యూనిట్ల షార్టేజ్ ఉండేది. అయితే.. రెండు నెల‌ల వ్య‌వ‌ధిలోనే ఆ స‌మ‌స్య‌ను అధిగ‌మించిన ఘ‌న‌త బాబుదే. విద్యుత్ లోటు బాబు హ‌యాంలో మిగులు ఘ‌న‌త సాధించారు. తాజాగా ఏపీలో క‌రెంటు కోత‌లు న‌డుస్తున్నాయి. జ‌గ‌న్ పాల‌న‌లో ఇదో వైఫ‌ల్యంగా చెప్ప‌క త‌ప్ప‌దు.
ఇవ‌న్ని ఒక ఎత్తు అయితే తాను గెలిస్తే.. రూ.3వేలు ఫించ‌న్లు ఇస్తాన‌ని చెప్పిన జ‌గ‌న్ ఇప్పుడు రూ.2250తోనే స‌రిపెట్టారు. అదేమంటే వాయిదాల క‌థ‌ను వినిపించి.. మూడేళ్ల‌లో ద‌శ‌ల వారీగా పెంచుతున్న‌ట్లు చెప్పారు. వైఎస్ హ‌యాంలో రూ.375 వ‌ర‌కు ఉన్న ఫించ‌న్ల‌ను టీడీపీ హ‌యాంలో రూ.2075 వ‌ర‌కు పెంచారు. అయితే.. గ‌డిచిన కొద్ది రోజులుగా టీడీపీ ప్ర‌భుత్వం కేవ‌లం రూ.వెయ్యి మాత్ర‌మే ఫించ‌న్ల‌ను ఇచ్చింద‌ని ప్ర‌చారం చేస్తున్నారు. అదంతా విష ప్ర‌చార‌మ‌ని.. బాబు ప్ర‌భుత్వం రూ.2025 ఫించ‌న్ ఇచ్చింద‌న్న విష‌యాన్ని మీడియా ముందుకు వ‌చ్చి చెప్పాల్సిన తెలుగు త‌మ్ముళ్లు ప‌త్తా లేకుండా పోవ‌టాన్ని ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు. జ‌గ‌న్ ముఖ్యమంత్రి అయ్యాక సీఎంఆర్ ఎఫ్.. బీమా క్లెయిములు నిలిపివేయ‌టాన్ని ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు. ఇవేమీ మీడియాలో ఫోక‌స్ కావ‌ట్లేద‌ని.. దీనికి తెలుగు త‌మ్ముళ్లు బాధ్య‌త వ‌హించాల‌ని కోరుతున్నారు.