వైసీపీని తెగ ఇరుకునపెట్టేసిన టీడీపీ లాజిక్

July 11, 2020

ఏపీ అసెంబ్లీ సమావేశాల ఆరో రోజున పాలక వైసీపీని ఇరుకునపెట్టడంలో, నిలదీయడంలో విపక్ష టీడీపీ దూకుడు ప్రదర్శించింది. ప్రభుత్వ పాలన రివర్సులో ఉందంటూ నిరసనగా వెనక్కు నడుచుకుంటూ వచ్చిన టీడీపీ సభ్యులు సభలో జోరు చూపించారు. ముఖ్యంగా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు బలమైన పాయింట్లతో పాలక పార్టీని ఇరుకునపెట్టారు.
రాష్ట్రంలో మద్యం వినియోగం తగ్గించడానికే ధరలు పెంచామని కొద్దికాలంగా వైసీపీ ప్రభుత్వం చెబుతుండడంతో రామానాయుడు మండిపడ్డారు. కొత్త ఎక్సయిజ్ పాలసీ వైసీపీ నేతలకు కాసులు కురిపిస్తోందన్నారు. ఆర్టీసీ టికెట్ ధరలు పెంచడంపై ఆయన మండిపడుతూ.... ధరలు పెరిగితే మద్యం వినియోగం తగ్గుతుందంటున్నారు.. మరి ప్రయాణికులు తగ్గాలని ఆర్టీసీ ఛార్జీలు పెంచారా అని రామానాయుడు ప్రశ్నించారు.
అంతకుముందు ఆయన ఆర్టీసీ చార్జీల పెంపును నిరసిస్తూ బస్సులో ప్రయాణించారు. పాలకొల్లు నుంచి శివదేవుని చిక్కాల వరకు ఇతర ప్రయాణికులతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. అలాగే, పాలకొల్లు బస్టాండులో ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వం పెంచిన ఆర్టీసీ ధరలతో ప్రజలపై వెయ్యి కోట్ల రూపాయల భారం పడుతుందని, వెంటనే తగ్గించాలని రామానాయుడు డిమాండ్ చేశారు. పల్లెవెలుగు బస్సు కనీస చార్జీలను 50 శాతం పెంచడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే చార్జీలు పెంచడం దారుణమని, చార్జీల పెంపును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.