గెలిచినా, ఓడినా... మహానాడు నిర్వహించడం కష్టమే... ఎందుకంటే

February 19, 2020

తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కార్యక్రమాల్లో ‘మహానాడు’ ముఖ్యమైనది. ఆ పార్టీ వ్యవస్థాపకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి (మే 28) సందర్భంగా దీనిని నిర్వహిస్తుండడం అనవాయితీగా మారింది. ప్రతి సంవత్సరం మే 27 నుంచి 29 వరకు మహానాడును జరుపుతుంటారు. ఈ సమావేశాల్లోనే పార్టీకి సంబంధించిన కార్యక్రమాలను, ఏజెండాలను, వివిధ సమస్యలపై పార్టీ తీర్మాలను ప్రకటిస్తారు. ఈ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తెలుగుదేశం కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరవుతుంటారు. ఎంతో అంగరంగ వైభవంగా జరిగే ఈ పసుపు పండుగను ఈ సంవత్సరం నిర్వహించడం లేదని తెలుస్తోంది. మంగళవారం తన నివాసంలో జరిగిన భేటీలో చంద్రబాబు.. దీనిపై క్లారిటీ ఇచ్చారని సమాచారం.

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఈ నెల 23న వెలువడనున్నాయి. ఈ కారణంగానే మహానాడును నిర్వహించకూడదని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది. కౌంటింగ్ సమయంలో పార్టీ నాయకులంతా తలమునకలయ్యే అవకాశం ఉన్నందున.. వెంటనే మహానాడు నిర్వహణకు ఇబ్బందులు ఏర్పడవచ్చని చంద్రబాబు.. మంత్రులు, ఇతర నాయకులతో చెప్పినట్లు ఆ పార్టీ శ్రేణులు లీకులిస్తున్నాయి. అంతేకాదు, 1985, 1991, 1996 సంవత్సరాల్లో మహానాడును నిర్వహించలేదు. 1985, 1996 సమయాల్లో టీడీపీ అధికారంలో ఉంది. ఆ తర్వాత 2012లో కూడా టీడీపీ మహానాడును వాయిదా వేసింది. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉప ఎన్నికలు ఉన్న కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. దీనినే గుర్తు చేస్తూ టీడీపీ నాయకులు, అధినేత నిర్ణయాన్ని అంగీకరిస్తున్నారు. 

మరోవైపు ఓడినా గెలిచినా మహానాడు నిర్వహణకు ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో వాయిదా వేశారు. గెలిస్తే... ప్రభుత్వ ఏర్పాటు సంబరాలు కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు వ్యవహరాలు ఉన్నందున మహానాడు నిర్వహణకు ఇబ్బంది ఉంటుంది. ఓడితే... శ్రేణులు నిరుత్సాహంతో ఉండటం వల్ల సభకు సరిగా స్పందన ఉండకపోవచ్చన్న భావన ఉంది. సో ఎటు చూసినా మహానాడు నిర్వహణకు ఇబ్బంది ఉన్నందున వాయిదా వేసినట్టు తెలుస్తోంది.