ఏపీలో ఉప ఎన్నిక‌... ఆ టీడీపీ ఎమ్మెల్యే రాజీనామాకు రెడీ..!

May 27, 2020

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయాక‌ ఆ పార్టీ నుంచి పలువురు నేతలు బయటకు వచ్చేస్తున్నారు. కొందరు బిజెపి వైపు చూస్తుంటే... మరి కొందరు వైసీపీ లోకి వెళుతున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ఫలితాలు వచ్చి నెల రోజులు కూడా కాకుండానే ఏకంగా నలుగురు రాజ్యసభ సభ్యులు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపిలోకి జంప్ చేసేశారు. ఇక మ‌రికొంద‌రు ఓడిన నేత‌లు వైసీపీలోకి వెళ్లారు.. వెళ్లేందుకు ప్ర‌య‌త్నాలు కూడా చేస్తున్నారు. అన‌కాప‌ల్లి ఎంపీగా పోటీ చేసి ఓడిన అడారి ఆనంద్‌కుమార్ వైసీపీలోకి వెళ్లిపోగా... తూర్పుగోదావ‌రి జిల్లా ప్ర‌త్తిపాడు నుంచి పోటీ చేసి ఓడిపోయిన వ‌రుపుల రాజా కూడా వైసీపీ గూటికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

ఇక ఇప్పుడు మ‌రికొంద‌రు ఎమ్మెల్యేలు కూడా వైసీపీలోకి వెళ్లాల‌న్న ఉత్సుక‌త‌తో ఉన్నారు. కోటంరెడ్డి శ్రీథ‌ర్‌రెడ్డి తొలి అసెంబ్లీ స‌మావేశాల్లోనే తాము గేట్లు ఎత్తితే ఆరేడుగురు ఎమ్మెల్యేలు ఇప్ప‌టికిప్పుడే పార్టీ మార‌తార‌ని కూడా చెప్పిన సంగ‌తి తెలిసిందే. అయితే జ‌గ‌న్ మాత్రం ఎవ‌రు పార్టీ మారి వ‌చ్చినా త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేసి రావాల‌న్న్ కండీష‌న్ పెట్టేశారు. ఇక స్పీక‌ర్ కూడా ఈ విష‌యంలో స్ట్రిక్ట్‌గా ఉంటాన‌ని చెప్ప‌క‌నే చెప్పేశారు.

ఎవరు పార్టీ మారినా సరే.. అనర్హత వేటు వేయడం తథ్యం అని స్పీకరు తమ్మినేని సీతారాం చాలా స్పష్టంగా ప్రకటించేశారు. అందుకే బీజేపీలోకి వెళ్లాల‌నుకున్న ఎమ్మెల్యేలు కూడా ప్ర‌స్తుతానికి సైలెంట్‌గా ఉంటున్నారు. అయితే టీడీపీలో ఉంటే ఎప్ప‌ట‌కీ లైఫ్ లేద‌ని డిసైడ్ అయిన వారు మాత్రం త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేసి అయినా పార్టీ మారాల‌ని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఈ లిస్టులోనే ప్ర‌కాశం  జిల్లాకు చెందిన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి మాత్రం రాజీనామా చేసి అయినా వైసీపీలో చేరాల‌ని డిసైడ్ అయిన‌ట్టు తెలుస్తోంది.

గ‌తంలో కాంగ్రెస్ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ర‌వి ఆ త‌ర్వాత వైసీపీలో చేరి 2014 ఎన్నిక‌ల్లో ఆ పార్టీ నుంచి గెలిచారు. ఇక ఆ త‌ర్వాత టీడీపీలో చేరిన ర‌వి తాజా ఎన్నిక‌ల్లో వ‌రుస‌గా నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ ఎన్నిక‌ల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్ర‌భంజ‌నం వీచినా అద్దంకిలో ర‌వి ఏకంగా 13 వేల ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారంటే అద్దంకిలో ప్రధానంగా గొట్టిపాటి రవికి ఉన్న సొంత బలమే పనిచేసిందని, అతను అభ్యర్థి కాకపోతే టీడీపీ గెలిచేది కాదని చాలా విశ్లేషణలు వచ్చాయి.

ఈ నేప‌థ్యంలోనే ర‌వి టీడీపీతో పాటు ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి వైసీపీలోకి రావాల‌ని చూస్తున్న‌ట్టు తెలుస్తోంది. అదే జిల్లాకు చెందిన మంత్రి బాలినేనితో ర‌వికి ఉన్న సంబంధాల నేప‌థ్యంలో ర‌వి పార్టీ మారుతున్న‌ట్టు టాక్‌. అదే జ‌రిగితే అద్దంకికి ఉప ఎన్నిక త‌ప్ప‌దు.