బాబే సీఎం...ప్రెస్‌మీట్లో తొడ‌గొట్టి ప్ర‌క‌టించిన టీడీపీ లీడర్

September 18, 2019

సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో హోరాహోరీ ప్ర‌చారం కంటే...ఆదివారం సాయంత్రం వెలువడిన ఎగ్జిట్‌పోల్స్ రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి లోక్‌సభ, అసెంబ్లీ రెండింటిలోనూ వైసీపీదే హవా అని అత్యధిక సర్వేలు స్పష్టం చేశాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పగ్గాలు చేపట్టనున్నారని చెబుతున్నాయి. దాదాపుగా అన్ని సర్వేల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్‌కి అనుకూలంగా ఫలితాలు రాగా, లగడపాటి మాత్రం తెలుగుదేశం పార్టీ మరోసారి అధికారంలోకి రానుందని పేర్కొన్నారు. అయితే, ఈ ఎగ్జిట్‌పోల్స్‌, ల‌గ‌డ‌పాటి జోస్యం వంటి వాటిపై టీడీపీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు కుటుంబానికి వీర‌విధేయుడు అనే పేరున్న బుద్ధా వెంక‌న్న ఆస‌క్తిక‌ర రీతిలో స్పందించారు.

టీడీపీ ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ బుద్ధా వెంకన్న అమ‌రావ‌తిలో మీడియాతో మాట్లాడుతూ, ఈ సారి కూడా ఖచ్చితంగా చంద్రబాబే సీఎం అవుతారని జోస్యం చెప్పారు. టీడీపీ ఖచ్చింగా 130 – 135 స్థానాలను కైవసం చేసుకుంటుందని ఆయ‌న ప్ర‌క‌టించారు. ప్రజలు సంక్షేమాన్ని నమ్మారు... సీఎం చంద్రబాబును కూడా నమ్మారు.. టీడీపీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరన్నారు. లగడపాటి రాజగోపాల్ సర్వేకు మించి తెలుగుదేశం పార్టీకి సీట్లు వస్తాయని ప్ర‌క‌టించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోతుందన్న విషయం వైఎస్ జగన్‌కు తెలుసని బుద్దా వెంక‌న్న ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

వైఎస్ జగన్ ప్రతిపక్ష నాయకుడు అయితే అసెంబ్లీకి డుమ్మా కొడతారని వేరే వ్యక్తిని ప్రతిపక్ష నేతగా ఎన్నుకుంటారని బుద్దా వెంకన్న సెటైర్లు వేశారు. టీడీపీ కార్యకర్తలు కాలర్ ఎగరేసుకుని తిరగండి.. మన ప్రభుత్వం వస్తుంది. ఓవైపు టీడీపీ జెండా... మరోవైపు చంద్రబాబు ఫొటో ఉన్న జెండాలు రెండు బుజాలపై పెట్టుకుని ధర్జాగా తీరగాలని పిలుపునిచ్చారు. ఈ సంద‌ర్భంగా తొడ‌కొట్టి మ‌రీ...తెలుగుదేశం పార్టీదే విజ‌య‌మ‌ని ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం.