తెలంగాణలో ఎంపీగా పోటీ చేసే టీడీపీ అభ్యర్థి ఫిక్స్

December 05, 2019

లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గరపడడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించాలని ప్రయత్నాలు చేస్తుండగా, తెలంగాణలో మాత్రం పట్టు కోల్పోయి కష్టాలు పడుతోంది. కొద్దిరోజుల క్రితం ముగిసిన ముందస్తు ఎన్నికల్లో ఆ పార్టీ.. కాంగ్రెస్ సహా మరో రెండు పార్టీలతో జట్టు కట్టినా గెవలేకపోయింది. ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తెలంగాణ రాష్ట్ర సమితి లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 స్థానాల్లో 16 చోట్ల విజయం సాధించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించింది ఆ పార్టీ అధిష్ఠానం. దీనికితోడు, లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేయబోతున్నట్లు ప్రకటించడంతో టీడీపీకి కష్టాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలా..? వద్దా..? అన్న సంశయంలో ఆ పార్టీ నేతలు ఉండిపోయినట్లు రెండు రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో ఓ వార్త బయటికి వచ్చింది. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున ఓ సీనియర్ నేత పోటీ చేయబోతున్నారట. ఆయన మాజీ మంత్రి దేవేందర్ గౌడ్.

 

విభజన తర్వాత రాష్ట్రంలో క్యాడర్ ఉన్నా నాయకత్వలేమితో బాధపడుతోంది తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఈ సారి ఎన్నికల్లో ఎలాగైన ప్రభావం చూపించాలని నిర్ణయించుకున్నారు ఆ పార్టీ నేతలు. అందుకోసమే అసెంబ్లీలో పాటు, రాష్ట్రంలోని ముఖ్యమైన పార్లమెంట్ స్థానాలపై కన్నేశారు. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలవడంతో, కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. అందులో ముఖ్యంగా దేశంలోనే పెద్దదైన మల్కాజిగిరి స్థానాన్ని గెలుచుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది. ప్రస్తుతం ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న మల్లారెడ్డి గత ఎన్నికల్లో టీడీపీ తరపునే పోటీ విజయం సాధించారు. తర్వాత జరిగిన పరిణామాలతో ఆయన టీఆర్ఎస్‌లోకి జంప్ అయ్యారు. సో, సిట్టింగ్ స్థానమైన మల్కాజిగిరిని మరోసారి దక్కించుకోవాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. ఇందుకోసమే, సీనియర్ నేత దేవేందర్‌గౌడ్‌ను తమ అభ్యర్ధిగా నిలబెట్టాలని ఆ పార్టీ ప్లాన్ చేసింది. 2009 ఎన్నికలలో ప్రజారాజ్యం పార్టీ తరపున ఈ స్థానం నుంచి పోటీ చేసిన ఆయన ఓడిపోయారు. అయినా, మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్న దేవేందర్‌గౌడ్.. అక్కడ పట్టు కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు సాగిస్తున్నారట.