ఈ టీడీపీ ఎంపీ హ్యాట్రిక్ కొట్టబోతున్నారట

July 05, 2020

తెలుగుదేశం పార్టీకి చెందిన ఆయన ఇప్పటికి వరుసగా రెండు సార్లు ఎంపీగా విజయం సాధించారు. దీంతో వరుసగా మూడోసారి పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనకు టికెట్ కేటాయించారు. దీంతో ఆయన మరోసారి విజయం సాధించాలనే పట్టుదలతో బాగా పని చేశారు. ఆయన మాత్రమే కాదు.. ఆ పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాలను గెలిపించుకోవాలనుకున్నారు. తాజాగా ఎన్నికలు ముగిసిపోవడం.. ఆయా నియోజకవర్గాల్లో గెలుపోటములు బేరీజు వేసుకోవడం వంటివి చూసిన తర్వాత సదరు సిట్టింగ్ ఎంపీ చేసి ఈ ప్రయత్నాలు ఫలించబోతున్నాయని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆయనెవరో గుర్తు పట్టారా..? ఆయనే అనంతపురం జిల్లా హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప.

2009 ఎన్నికల్లో నిమ్మల కిష్టప్ప తొలిసారి ఈ స్థానం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో ఇదే స్థానం నుండి నిమ్మల కిష్టప్ప పోటీ చేసి నెగ్గారు. మూడోసారి నిమ్మల కిష్టప్ప టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేశారు. హిందూపురం పార్లమెంట్ స్థానం నుండి ఈ దఫా వైసీపీ మాజీ పోలీసు అధికారి గోరంట్ల మాధవ్‌ను బరిలోకి దింపింది. వీరిద్దరూ కూడ బీసీ సామాజిక వర్గానికి చెందినవారే. దీంతో హోరాహోరీ పోరు జరుగుతుందని అంతా భావించారు. అయితే, హిందూపురం పార్లమెంట్ పరిధిలో ఆరు చోట్ల టీడీపీకి సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. కదిరిలో గత ఎన్నికల్లో వైసీపీ తరపున విజయం సాధించిన చాంద్ బాషా టీడీపీలో చేరారు. ఈ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో హిందూపురం, మడకశిర, పెనుకొండ, ధర్మవరం, రాఫ్తాడు, కదిరి, పుట్టపర్తి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో టీడీపికి మంచి పట్టుంది.

గత ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో టీడీపీ హవా చూపించింది. ఇక్కడి 14 అసెంబ్లీ స్థానాల్లో 12 చోట్ల విజయం సాధించడంతో పాటు రెండు పార్లమెంట్లను కైవశం చేసుకుంది. దీంతో ఈ ఎన్నికల్లో అక్కడి అభ్యర్థులు రెట్టించిన ఉత్సాహంతో పని చేసుకుపోయారు. ఈ క్రమంలోనే హిందూపురం పార్లమెంట్ స్థానాన్ని మరోసారి ఆ పార్టీ దక్కించుకోబోతుందనే టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి హిందూపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో కూడా ఇరు పార్టీలూ ఇదే ధీమాలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే, ఆది నుంచీ ఆ ప్రాంతంలో టీడీపీయే ఆధిక్యత ప్రదర్శిస్తోంది. తాజా ఎన్నికల్లోనూ అవే ఫలితాలు వచ్చి తీరుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. హిందూపురంలో మళ్లీ నిమ్మల కిష్టప్ప విజయం ఖాయమనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇదే జరిగితే నిమ్మల కిష్టప్ప ఎంపీగా హ్యాట్రిక్ చేసిన వారవుతారు.