’’13 నెలల్లో లెక్కలేనన్ని ఘోరాలు‘‘

August 04, 2020

13 నెలలుగా రాష్ట్రంలో అనేక దారుణ పరిణామాలు జరిగాయని రాష్ట్రపతికి టీడీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు. ఏపీలో ప్రభుత్వం చేసిన తప్పులు, జరుగుతున్న ఘోరాలు, మానవ హక్కుల ఉల్లంఘన వంటి విషయాలతో కూడా పూర్తి ఆధారాలతో రాష్ట్రపతికి ఒక నివేదికను అందజేశారు.

ప్రాథమిక హక్కులు కాలరాయడం, భావ ప్రకటనా స్వేచ్ఛ కాలరాయడం, రూల్ ఆఫ్ లా ఉల్లంఘించడం, రాజ్యాంగ ఉల్లంఘనలపై ముఖ్యంగా ఫిర్యాదు చేశారు. ప్రజలు తీవ్ర బాధలు పడుతున్నారని... పరిపాలనలో రాజ్యాంగం అమలుకావడం లేదని చెప్పారు.

ఇక వీటితో పాటు రాష్ట్రంలో వైసీపీ నాయకులు చేస్తున్నహింసా విధ్వంసాలు, ఇళ్ల కూల్చివేత, ఆస్తుల ధ్వంసం, భూములు లాక్కోవడం, తోటల నరికివేత, బోర్ వెల్స్ ధ్వంసం, బీసీ, ఎస్సీ,ఎస్టీ ముస్లిం మైనారిటీలపై దౌర్జన్యాల గురించి రాష్ట్రపతికి వారు విపులంగా వివరించారు.

టీడీపీతో సహా ఇతర ప్రతిపక్షాల నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని, తప్పుడు కేసులు పెడుతున్నారని చెప్పారు. సోషల్ మీడియా పోస్టులు పెట్టిన కారణంగా కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతన్నారన్నారు.
ఇక దళితులపై అమానుషాలు, మానవ హక్కుల ఉల్లంఘనలకు లెక్కేలేదన్నారు. వీటన్నింటికి సంబంధించిన సాక్ష్యాధారాలతో సహా రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు టీడీపీ ఎంపీలు. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ను కలిసిన వారిలో ఎంపీలు గల్లా జయదేవ్, కేశినేని నాని, రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్రకుమార్ ఉన్నారు.