టీడీపీలో కొత్త జోష్... తొలి భేటీలో జగన్ పైనే వ్యూహం

February 22, 2020

ఏపీ అసెంబ్లీ సమావేశాలకు సమయం ఆసన్నమైంది. ఈ నెల 9 నుంచి ప్రారంభం కానున్న సమావేశాలకు సంబంధించి ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఇప్పటికే కసరత్తు మొదలెట్టేసింది. శుక్రవారం అమరావతి పరిధిలో కొత్తగా నిర్మించిన పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించిన పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు... ఆ మరునాడు... అంటే శనివారమే అందులో తొలి భేటీని నిర్వహించారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ అయిన చంద్రబాబు... జగన్ సర్కారుకు డేంజర్ బెల్స్ మోగించారనే చెప్పాలి. 

రాష్ట్రంలో కొత్తగా పాలనా పగ్గాలు చేపట్టిన వైసీపీ ప్రభుత్వానికి ఆరు నెలల సమయం ఇద్దామని చంద్రబాబు గతంలో నిర్ణయించిన సంగతి తెలిసిందే. గత నెలాఖరుతో ఆ గడువు తీరిపోయింది. అదే సమయంలో పార్టీ కేంద్ర కార్యాలయానికి ప్రారంభోత్సవం జరగడం, ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులంతా ఉత్సాహంగా పాలుపంచుకోవడం, ఆ వెంటనే అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చంద్రబాబు కీలక భేటీ నిర్వహించడం చూస్తుంటే... టీడీపీలో ఇప్పుడు కొత్త జోష్ స్పష్టంగానే కనిపిస్తోందని చెప్పక తప్పదు. కొత్త జోష్ తో సరికొత్త వ్యూహంతో అసెంబ్లీలో అడుగుపెట్టనున్న టీడీపీ... జగన్ సర్కారుకు చుక్కలు చూపడం ఖాయమేనన్న వాదన వినిపిస్తోంది.

అయినా కొత్త కార్యాలయంలో తొలి భేటీలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు చంద్రబాబు చేసిన ఉద్బోధ ఏమిటన్న విషయానికి వస్తే... వైసీపీ సర్కారుకు ఇచ్చిన ఆరు నెలల గడువు ముగిసిందని చంద్రబాబు తేల్చి పారేశారు. ఇకపై వైసీపీ సర్కారు కొత్తదన్న భావనతో సీఎంను గానీ, మంత్రులను గానీ ఉపేక్షించాల్సిన అవసరం లేదని... వైసీపీ సర్కారు తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై గట్టిగా పోరాటం సాగించాల్సిందేనని చంద్రబాబు సూచించారు. అంతేకాకుండా అసెంబ్లీ సమావేశాలకు అందరూ తప్పనిసరిగా హాజరై... ప్రతి ఒక్కరు చర్చల్లో పాలుపంచుకునేలా చూసుకోవాలని దిశానిర్దేశం చేశారు. మొత్తంగా చంద్రబాబు చూపిన దిశానిర్దేశంతో పార్టీ ప్రజాప్రతినిధుల్లో కొత్త ఉత్సాహం కనిపించింది. వెరసి జగన్ సర్కారుకు ఇకపై బ్యాండ్ బాజానేనన్న మాట.