టీఆర్ఎస్ హ్యాండ్ ఇచ్చినా టీడీపీ అండగా వుంటదట…!

December 06, 2019

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ.. తెలంగాణలో మాత్రం జీవం కోల్పోయింది. ఇటీవల వచ్చిన ముందుస్తు ఎన్నికల ఫలితాలతో టీడీపీకి కష్టాలు మొదలయ్యాయి. రాష్ట్రంలో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న ఆ పార్టీ.. ఈ ఎన్నికల్లోనైనా ప్రభావం చూపించాలని భావించింది. అందుకోసం చిరకాల ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీతో జతకట్టింది. ఈ రెండు పార్టీలు, మరికొన్ని పార్టీలను కలుపుకుని తెలంగాణ రాష్ట్ర సమితికి వ్యతిరేకంగా ప్రజాకూటమిని ఏర్పాటు చేశాయి. ఈ పొత్తుల్లో భాగంగా టీడీపీకి 13 సీట్లు దక్కగా అందులో రెండు చోట్ల మాత్రమే ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో తెలంగాణలో కనుమరుగయ్యే పరిస్థితికి దిగజారింది. టీఆర్ఎస్ రెండోసారి అధికారాన్ని చేపట్టిన తర్వాత టీడీపీ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలను కూడా ఆ పార్టీలో చేర్చుకోడానికి ప్రయత్నాలు ప్రారంభించేశారు ఆ పార్టీ నాయకులు. వీళ్లు ప్రస్తుతానికి టీడీపీలోనే కొనసాగుతామని చెబుతున్నా.. తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉంటాయో చెప్పడం కష్టమే.

మరోవైపు, టీడీపీ నాయకులు త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలపై దృష్టి సారించారు. ఇలాంటి సమయంలో ఆ పార్టీ నుంచి పోటీ చేయబోయే అభ్యర్థి గురించి ఓ విషయం వెలుగులోకి వచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉన్నా.. తమకు కచ్చితంగా దక్కుతుందనుకునే స్థానంలో పోటీ చేయబోయే ఎంపీ అభ్యర్థిని టీడీపీ అధిష్ఠానం ఫైనల్ చేసిందట. ఆయనే సీనియర్ నేత బానోత్ మోహన్‌లాల్. ఎక్సైజ్‌ శాఖలో పని చేసిన మోహన్‌లాల్‌ 2013 సెప్టెంబర్‌ 19న చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో మహబూబాబాద్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. తర్వాత టీఆర్‌ఎస్‌ ఎంపీ వినోద్‌కుమార్‌, పాలకుర్తి టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి టీఆర్‌ఎస్‌లో చేరారు. అప్పట్లోనే మహబూబాబాద్‌ అసెంబ్లీ టికెట్‌పై హామీ పొందినట్లు చెబుతూ వచ్చారు. ఈ క్రమంలోనే నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ టీఆర్‌ఎస్‌ శ్రేణులకు చేరువయ్యారు.

 

అయితే, టికెట్ కేటాయించకపోవడంతో ముందుస్తు ఎన్నికలకు ముందు చంద్రబాబు అధ్యక్షతన హైదరాబాద్‌లో జరిగిన టీటీడీపీ సమావేశంలో టీఆర్ఎస్ నేత బానోత్‌ మోహన్‌లాల్‌ తన సతీమణి లక్ష్మిదేవితో కలిసి చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. చంద్రబాబునాయుడితో ఉన్న పూర్వ సంబంధాల నేపథ్యంలో మహబూబాబాద్‌ టికెట్‌పై స్పష్టమైన హామీ పొంది టీడీపీలో చేరినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈయనకే టికెట్ ఇచ్చేందుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఈ మేరకు టీటీడీపీ నేతలు మోహన్‌లాల్‌కు సంకేతాలు పంపించారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆయన మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటనలు చేస్తున్నారట. ఈయన అభ్యర్థిత్వంపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందనే టాక్ వినిపిస్తోంది.