జగన్ మెడకు చుట్టుకున్న పట్టిసీమ

January 26, 2020

ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. గత ఐదేళ్లలో టీడీపీ నేతలు ఎన్నో అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారంటూ వైసీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాదు, ప్రాజెక్టుల పేరు చెప్పి ఎంతో డబ్బు దోచుకున్నారని అంటున్నారు. ముఖ్యంగా పట్టిసీమ ఎత్తిపోతల పథకం విషయంలో అధికార పార్టీ నేతలు ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితో పాటు వైసీపీ నేతలకు అదిరిపోయే కౌంటరిచ్చింది.

సోషల్ మీడియా వేదికగా తెలుగుదేశం పార్టీ పట్టిసీమ విషయంలో చేసిన పోస్టు చర్చనీయాంశం అవుతోంది. ఇప్పుడిది ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్ అవుతోంది. ‘‘పట్టిసీమ శుద్ధ దండగ. మేమూ మా పార్టీ పట్టిసీమకి వ్యతిరేకం అన్నారు. అది పట్టిసీమ కాదు వట్టిసీమ అన్నారు. ‘నాలుగు టీఎంసీల పట్టిసీమతో 180 టీఎంసీల కృష్ణా డెల్టాని ఎట్లా కాపాడతాం అధ్యక్షా?’ అంటూ ఆరోజు ప్రతి పక్షనాయకులుగా మీ విషయ పరిజ్ఞాన లోపాన్ని చాటుకున్నారు. ‘ఏ ఆగస్టులోనో గోదావరికి వరదలొస్తే జూన్ మాసంలోనే కృష్ణా డెల్టాకు నీరెలా ఇస్తారు’ అని ఆనాడు అయోమయంగా అడిగారు.

నిన్నటికి నిన్న అసెంబ్లీలో అధికారపక్ష హోదాలోనూ పట్టిసీమ ఖర్చు వృధా ఖర్చు అన్నారు. ‘అది నిజంగా వృధా ప్రాజెక్టు అని వారు భావిస్తే ఈ ఏడాది పట్టిసీమ మోటార్లు ఆన్ చేయొద్దని, డెల్టా రైతులకు నీరివ్వకుండా, వారి స్పందన ఏమిటో చూడాలి’ అని అచ్చెన్నాయుడు అని నెల కూడా కాకుండా పట్టిసీమ మోటార్లను ఆన్ చేశారా ముఖ్యమంత్రి గారు?.. నాలుగు రోజులాగి ‘పట్టిసీమ ద్వారా ఈ యేడు డెల్టా రైతుకు ఇన్ని టీఎంసీల నీరిచ్చి, ఇన్ని ఎకరాల పంటను కాపాడాం. గతంలో ఎప్పుడూ లేనంత దిగుబడిని సాధించిన రైతు ప్రభుత్వం మాది’ అని మీ నోట నుండో, మీ నీటిపారుదల శాఖా మంత్రి నోటి నుండో వినాలని ఎదురుచూస్తున్నాం.

దేవుడు రాసిన స్క్రిప్ట్ ఏంటో గానీ మీరు వద్దన్న పట్టిసీమనే... మీరు వృథా అన్న పట్టిసీమనే... చంద్రబాబు ముందుచూపుతో ఆలోచించి, చెమటోడ్చి నిర్మించిన ప్రాజెక్టునే... ఈరోజు మీరు ఆన్ చేసేలా చేశారు. మీరొచ్చాక వర్షాలు రాక చివరికి పట్టిసీమే దిక్కయింది. జూన్‌లో నీరెలా ఇస్తారని అన్నారు. జూన్‌లోనే మీతో నీరు విడుదల చేసేలా చేసింది. వాహ్! చంద్రబాబు! గెలుపంటే మీదే మీదే’’ అంటూ ఈ పోస్టులో రాసుకొచ్చింది టీడీపీ సోషల్ మీడియా విభాగం. దీంతో వైసీపీ నాయకుల వద్ద సమాధానమే లేకుండా పోయింది. అందుకే దీనికి మంచి స్పందన వస్తోంది.

మరోవైపు, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ‘‘దేవుడు రాసిన స్క్రిప్ట్ ఎంత గొప్పగా ఉంటుందనడానికి, జరిగిన ఎన్నికలే నిదర్శనం. ఎమ్మెల్యేలను కొన్న వారికి వచ్చిన సీట్లు ఎన్నో తెలుసా? అక్షరాలా 23 సీట్లు. ముగ్గురు ఎంపీలను కొన్నవారికి అక్షరాలా వాళ్లకు వచ్చిన సీట్లు ఎన్నో తెలుసా? మూడు. అది కూడా ఎప్పుడొచ్చిందో తెలుసా? 23వ తారీఖున. ఎంత గొప్పగా జరిగిందంటే... దేవుడు ఇలా కూడా స్క్రిప్ట్ రాస్తాడు’’ అని అంటూ వస్తున్నారు. ఇప్పుడిదే కాన్సెప్టుతో టీడీపీ పోస్టు చేయడం విశేషం.