ఎంపీల వ్యాపారాలే టీడీపీ కొంప ముంచుతాయా?

May 26, 2020

ఇపుడు వ్యాపారం - రాజకీయం వేరు వేరు కాదు. ఏది ముందు ఏది వెనుక అన్న తేడానే గాని... ప్రతి రాజకీయ నాయకుడు వ్యాపారే. ఇది పార్టీల కొంప ముంచుతోంది. మునుపటి రోజుల్లో పార్టీకి ఆదాయాలు సమకూర్చేవాళ్లు వేరే వాళ్లు, రాజకీయ నాయకులు వేరేవాళ్లు. అందుకే పార్టీలు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎలాంటి ఇబ్బంది పడేవారు కాదు. కానీ నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రతి ఒక్కరికి అధికారం అండ తప్పనిసరి అయిపోయింది. దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి.
2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో వ్యాపారాల్లో ఉన్న రాణిస్తున్న టీడీపీ నేతలు ఇరకాటంలో పడ్డారు. దీంతో పార్టీ నాయకులను కాపాడుకోవడం కూడా పార్టీకి కత్తిమీద సామవుతోంది. అధిక సీట్లు గెలవడంతో మంచోడు అనే పేరు తెచ్చుకుని జనాల్లో మార్కులు కొట్టేద్దామని జగన్ ఫిరాయింపులు దూరంగా పెట్టాడు. కానీ కేంద్రంలో లోక్ సభలో అధికారం నిండుగా ఉండి, రాజ్యసభలో మైనారిటీలో ఉన్న బీజేపీ టీడీపీపై కన్నేసింది. పార్లమెంటు సభ్యులు బీజేపీలోకి దూకడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మొన్నటి ఎన్నికల్లో గెలిచిన ముగ్గురు లోక్ సభ ఎంపీల్లో ఒకరు బీజేపీతో టచ్‌లో ఉన్నారని ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండగా... తాజాగా తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు కూడా బీజేపీ పట్ల ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది. కర్మ ఏంటంటే... వారి వ్యాపారాలే దీనికి కారణం అవుతున్నాయి.
తెదేపాకు చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులతోపాటు, కొందరు మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు భాజపాలో చేరతారని వార్తలు వినిపిస్తున్నాయి. నలుగురు ఎంపీలతోపాటు గుంటూరు జిల్లాకు చెందిన ఒక మాజీ మంత్రి, మరో మాజీ ఎమ్మెల్యే, అనంతపురం జిల్లాకు చెందిన ఒక మాజీ ఎంపీ, కొందరు మాజీ ఎమ్మెల్యేలు భాజపాలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. భాజపాలో చేరతారని ప్రచారం జరుగుతున్న ఈ నాయకుల్లో ఎవరూ ఆ విషయాన్ని ఇంతవరకూ ధ్రువీకరించ లేదు. అలాగని తాము భాజపాలోకి వెళ్లబోమని ఖండించడమూ లేదు. బీజేపీ వారి వ్యాపారాలను చూపించి పరోక్షంగా బెదిరిస్తోంది. దీంతో వారు సంకటంలో పడ్డారు. జగన్ ను అడ్డం పెట్టుకునే రాష్ట్ర కేంద్ర అధికార దాహంతో బీజేపీ చెలరేగిపోతోంది. రాష్ట్రంలో సొంతంగా బలోపేతం కావాలని భావిస్తున్న బీజేపీ అందుకోసం టీడీపీని టార్గెట్ చేసింది. ఈ అయిదేళ్లు తమకు కష్టాలు తప్పవని టీడీపీ నాయకులకు ఇప్పటికే అర్థం కావడంతో తమ వ్యాపార ప్రయోజనాల రీత్యా పక్కదారి చూస్తున్నారు. దీనిని అడ్డుకోవడానికి తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.