జ‌గ‌న్ ఇంటికి ముగ్గురు తెలుగు త‌మ్ముళ్లు.. ఎందుకు??!!

July 01, 2020

ఎన్నిక‌ల్లో చిత్తుగా ఓడిన టీడీపీ ఇప్పుడిప్పుడే.. ఆ షాకు నుంచి కొంచెం కొంచెం బ‌య‌ట‌కు వ‌స్తోంది. గెలిచినా.. ఓడినా చేయాల్సిన కొన్ని కార్య‌క్ర‌మాల్ని నిర్వ‌హించాల్సి ఉంటుంది. తాజాగా అలాంటి వాటికి సంబంధించి నిర్ణ‌యాలు తీసుకునేందుకు వీలుగా టీడీఎల్పీ స‌మావేశాన్ని నిర్వ‌హించారు.
ఇదిలా ఉంటే.. టీడీపీ పార్ల‌మెంట‌రీ ప‌క్ష నేత‌గా గుంటూరు ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ ను బాబు నియ‌మించారు. లోక్ స‌భ‌లో పార్టీ నేత‌గా శ్రీ‌కాకుళం ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు..రాజ్య‌స‌భ‌లో నేత‌గా ఎంపీ సుజ‌నాచౌద‌రిని ఎంపిక చేశారు. ఇదిలా ఉంటే.. జ‌గ‌న్ ప్ర‌మాణ‌స్వీకారం నేప‌థ్యంలో గురువారం ఉద‌యం ముగ్గురు ఎమ్మెల్యేల బృందం ఒక‌టి తాడేప‌ల్లిలోని జ‌గ‌న్ నివాసానికి వెళ్లి.. ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు చెప్ప‌నున్నారు.
జ‌గ‌న్ ఇంటికి వెళ్లేందుకు ముగ్గురు టీడీపీ నేత‌ల్ని ఎంపిక చేశారు. వారెవ‌రంటే.. అచ్చెన్నాయుడు.. ప‌య్యావుల కేశ‌వ్.. గంటా శ్రీ‌నివాస‌రావుల్ని ఎంపిక చేశారు. జ‌గ‌న్ ప్ర‌మాణ‌స్వీకారానికి హాజ‌రు కాకూడ‌ద‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు నిర్ణ‌యం తీసుకున్నారు. దీంతో.. ఆ కార్య‌క్ర‌మానికి ముందే.. ముగ్గురు స‌భ్యుల బృందాన్ని పంపి శుభాకాంక్ష‌లు తెల‌పాల‌ని నిర్ణ‌యించారు.
ఆస‌క్తిక‌ర అంశం ఏమంటే.. జ‌గ‌న్ ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వానికి వెళ్లేందుకు చంద్ర‌బాబు స‌ముఖత వ్య‌క్తం చేశార‌ట‌. అయితే.. పార్టీ నేత‌లు వారించిన‌ట్లుగా తెలుస్తోంది. ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వం రాజ్ భ‌వ‌న్ లో జ‌రిగితే.. వెళ్లినా బాగుంటుంద‌ని.. కానీ.. ఒక బ‌హిరంగ ప్ర‌దేశంలో చేయ‌నున్న ప్ర‌మాణ‌స్వీక‌రోత్స‌వానికి వెళ్ల‌టం స‌రికాద‌ని అత్య‌ధిక నేత‌లు అభిప్రాయ‌ప‌డిన‌ట్లుగా చెబుతున్నారు. దీంతో.. తాను వెళ్ల‌కూడ‌ద‌ని.. అంత‌కు ముందే టీడీపీ బృందం వెళ్లి జ‌గ‌న్ కు శుభాకాంక్ష‌లు తెల‌పాల‌న్న నిర్ణ‌యాన్ని తీసుకున్నారు.