షాక్- టీడీపీకి ఓటేసినందుకు ఊరి నుంచి త‌రిమేశారు!

July 04, 2020

రాజ‌కీయం అన్నిచోట్ల ఒకేలా ఉండ‌దు. రెండు తెలుగు రాష్ట్రాల్లో చూస్తే.. అధికార బ‌దిలీ సామాన్యుల బ‌తుకుల్లో ఎంత ప్ర‌భావాన్ని చూపిస్తుంద‌న్న విష‌యం తాజా ఉదంతాన్ని చూస్తే ఇట్టే అర్థ‌మ‌వుతుంది. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో టీడీపీకి ఓటు వేసినందుకు ఐదేళ్లు ఊళ్లోకి రాకూడ‌దంటూ జ‌గ‌న్ పార్టీ నేత‌లు బెదిరిస్తున్న వైనం షాకింగ్ గా మారింది.
గుంటూరు జిల్లా మాచ‌వ‌రం మండ‌లం పిన్నెల్లి గ్రామానికి చెందిన దాదాపు 70 కుటుంబాల వారు గ్రామాన్ని విడిచి పెట్టి.. పొరుగున ఉన్న గామాల‌పాడులో త‌ల‌దాచుకున్న దారుణం తాజాగా తెర మీద‌కు వ‌చ్చింది.
టీడీపీకి ఓటేసినందుకు ఐదేళ్లు త‌మ‌ను ఊళ్లోకి రావొద్దంటున్నారంటూ గుంటూరు రూర‌ల్ ఎస్పీని క‌లిసి ఫిర్యాదు చేశారు. త‌మ‌పూ దాడి చేస్తున్న 26 మంది పేర్లు.. వివ‌రాల్ని బాధితులు అంద‌జేశారు. దీంతో స్పందించిన ఎస్పీ.. ఈ విష‌యాన్ని విచారించి చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హామీ ఇచ్చారు.
ఎన్నిక‌ల్లో టీడీపీకి ఓటు వేసినందుకు జ‌గ‌న్ పార్టీ నేత‌లు త‌మ‌ను రాళ్లు.. క‌ర్ర‌ల‌తో కొట్టి.. ఊళ్లో ఉండొద్దంటూ బెదిరించి వెళ్ల‌గొట్టార‌ని వారు వాపోతున్నారు. ఉన్న ఊరిని వ‌దిలేసిన 70 కుటుంబాలు ఇప్పుడు ప‌క్క‌నున్న గ్రామంలో త‌ల దాచుకుంటున్నాయి.
త‌మ మాట కాద‌ని ఊళ్లోకి వ‌స్తే చంపేస్తామ‌ని బెదిరిస్తున్న‌ట్లుగా వారు వాపోతున్నారు. వ్య‌వ‌సాయ‌మే వృత్తిగా ఉన్న వీరు పొలాల్లోకి వెళుతుంటే.. గ్రామంలోకి రావొద్దంటున్నార‌న్నారు. పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తే వారు కేసులు న‌మోదు చేయ‌టం లేద‌ని వాపోతున్నారు.
ఇలాంటి ప‌రిస్థితి దాదాపు 200 కుటుంబాల‌కు ఉన్న‌ట్లుగా వారు చెబుతున్నారు. ఒక ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక‌లో ప్ర‌చురిత‌మైన ఈ వార్త ఇప్పుడు సంచ‌ల‌నంగా మార‌ట‌మే కాదు.. ఏపీలో ఇంత దారుణ ప‌రిస్థితి ఉందా? అన్న క్వ‌శ్చ‌న్ వ‌చ్చేలా చేస్తోంది. అంద‌రిని క‌లుపుకుపోతున్న జ‌గ‌న్‌.. ఇలాంటివి లేకుండా చేయాల్సిన అవ‌స‌రం ఉంది. ఈ త‌ర‌హా ఉదంతాల‌ను ఆయ‌న ప‌ర్స‌న‌ల్ గా టేక‌ప్ చేసి.. ఇష్యూ క్లోజ్ చేస్తే.. ఆయ‌న నాయ‌క‌త్వం మ‌రో స్థాయికి చేర‌టం ఖాయ‌మ‌న్న మాట వినిపిస్తోంది.మ‌రి.. జ‌గ‌న్ ఏం చేస్తారో చూడాలి.