సెలక్ట్ కమిటీపై ఎత్తుకు పైఎత్తు: టీడీపీ ఏం చేస్తుంది?

May 25, 2020

సెలక్ట్ కమిటీ వ్యవహారంపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. సెలక్ట్ కమిటీల ఏర్పాటుపై ఏపీ మండలి చైర్మన్ షరీఫ్ పంపిన ఫైల్‌ను మండలి కార్యదర్శి వెనక్కి పంపించారు. పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై సెలక్ట్ కమిటీలు ఏర్పాటు చేయాలని చైర్మన్ ఫైల్ పంపించగా, అది నిబంధనలకు విరుద్ధమని కార్యదర్శి తిప్పి పంపించారు. చైర్మన్ మరోసారి దానిని కార్యదర్శికి పంపించగా శుక్రవారం మరోసారి తిప్పి పంపించారు. క్లాజ్ 189ఏ నిబంధనల ప్రకారం సెలక్ట్ కమిటీ ఏర్పాటు సాధ్యం కాదని స్పష్టం చేశారు.

సెలక్ట్ కమిటీ ఏర్పాటు కాదని కార్యదర్శి.. మండలి చైర్మన్ పంపిన ఫైల్‌ను తిప్పి పంపించిన నేపథ్యంలో గడువులోగా ఈ కమిటీ ఏర్పాటు కాకుంటే బిల్లులకు ఆమోదం లభించినట్లేనని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇక గవర్నర్ ఆమోదముద్ర పడితే సరిపోతుందంటున్నారు. గడువులోగా సెలక్ట్ కమిటీ ఏర్పాటు కాలేదు కాబట్టి నిబంధనల ప్రకారం పద్నాలుగు రోజులు దాటితే ఆ బిల్లులు ఆమోదం పొందినట్లుగానే పరిగణించాల్సి ఉంటుందనేది అధికార పార్టీ నేతల మాట.

ఇప్పుడు టీడీపీ వేసే అడుగు ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. సెలక్ట్ కమిటీ ఏర్పాటీని ఏర్పాటు చేస్తూ చైర్మన్ నిర్ణయించారని, దానిని తిప్పి పంపించే అధికారం కోర్టులకే ఉండదని, అలాంటిది అధికారులు తిప్పి పంపించడమేమిటనేది ప్రతిపక్షం వాదన. మండలి చైర్మన్ చెప్పినట్లుగా కార్యదర్శి చేయాలని, ఆయన నిర్ణయాలకు భిన్నంగా వెళ్లడం సరికాదని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ న్యాయపరంగా ముందుకు వెళ్లే అంశాన్ని పరిశీలిస్తోంది. మార్చి 15వ తేదీ నుండి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావొచ్చు. అప్పుడు మరోసారి ఈ బిల్లుల అంశం శాసన సభ, మండలిలో చర్చకు రావడం ఖాయంగా కనిపిస్తోంది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా చైర్మన్ పంపిన పైళ్లను వెనక్కి పంపిన అధికారిపై ప్రతిపక్ష ఎమ్మెల్సీలు నోటీసు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే న్యాయపరంగాను ముందుకెళ్లవచ్చు.