జాతీయ మీడియాలో తన సర్వే బయటపెట్టిన చంద్రబాబు

May 26, 2020

ఎన్నికల తర్వాత జగన్ మేము గెలవబోతున్నాం అని స్పష్టంగా చెప్పారు. ​చంద్రబాబు ​కూడా అదే కాన్ఫిడెన్సుతో చెప్పారు. ఏపీలో వీరిద్దరి మధ్యలో జనసేనాని ప్రశాంతంగా ఉన్నారు. అయితే, రాష్ట్రంలో ఎవరిని అడిగినా జగన్ జగన్ అంటున్నారని ... టాక్ వస్తోంది. అయితే, మీరు జగన్ కి ఓటేశారా అని అడిగితే కొందరు లేదు అంటున్నారు. ఈసారి జగనే అనే వాళ్లను మీరు గతంలో ఎవరికి ఓటేశారు అని అడుగుతుంటే జగన్ కే అంటున్నారు. మరి తేడా ఎక్కడ వచ్చింది?.. సోషల్ మీడియాను వాడుకోవడంలో వైసీపీ పూర్తిగా విజయవంతం కావడం వల్ల జనంలో జగన్ టాక్ ను తెప్పించగలిగారు. దీన్ని వైసీపీయే కాదు, టీడీపీ కూడా నమ్మింది. అయితే, వాస్తవాలు వేరుగా ఉన్నాయంటున్నారు. జనసేన ప్రభావం ఏంటో ఎవరూ గెస్ చేయలేని నేపథ్యంలో గెలుపు గుర్రాన్ని అంచనా వేయడం అమాయకత్వమే అవుతుంది. మరోవైపు సుదీర్ఘమైన గ్యాప్ రావడం వల్ల చిత్రవిచిత్రమైన అనాలిసిస్ లు తెరమీదకు వచ్చాయి. దీంతో జనాల్లో మరింత సందిగ్దం నెలకొంది. ఊరు పేరు లేని సాధారణ వ్యక్తులు ఎవరికి ఏ పార్టీ నచ్చితే వారే గెలుస్తారని చెబుతున్నారు.
ఇవన్నీ పక్కన పెడితే... ఈరోజు చంద్రబాబు తాజాగా కరణ్ థాపర్ నేతృత్వంలో మొదలైన తిరంగ ఛానెల్ లో కరణ్ తో మాట్లాడారు. ఈ సందర్భంగా కరణ్ థాపర్ చంద్రబాబును నేరుగా ‘‘ మీరు అధికారం కోల్పోతున్నారని బలంగా వినిపిస్తోంది. మీరు వర్రీ అవుతున్నారా?’’ అని ప్రశ్నించారు. దీనికి చంద్రబాబు చాలా కూల్ గా స్పందించారు.
నేను ఏమీ వర్రీ కావడం లేదు. ఏపీలో లోక్ సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 18 నుంచి 20 సీట్లు రాబోతున్నాయి. మీరు రాసిపెట్టుకోండి.. అసెంబ్లీ సీట్లు 110 కంటే ఎక్కువ వస్తాయి. 130 వచ్చినా ఆశ్చర్యం లేదు. తెలుగుదేశం గెలుపునకు ఏపీలో ఎటువంటి ఢోకా లేదు అని చంద్రబాబు స్పష్టంగా, ఆత్మవిశ్వాసంతో చెప్పారు. ఇంతకుమునుపు చాలాసార్లు చంద్రబాబు గెలుస్తున్నాం అని చెప్పినా... ఏప్రిల్ 11 పోలింగ్ తర్వాత నెంబర్లతో సహా చంద్రబాబు తన గెలుపు గురించి చెప్పడం ఇదే తొలిసారి. కరణ్ ఈ ప్రశ్న వేసినపుడు చంద్రబాబు ఎటివంటి ఆందోళనకు గురికాకపోగా కూల్ గా నవ్వుతూ సమాధానం ఇవ్వడం చూస్తుంటే... తెలుగుదేశం శ్రేణుల్లో ఇపుడు కొంచెం నమ్మకం పెరిగే అవకాశం కనిపిస్తోంది.