ఆ సెంటిమెంట్ ప్రకారం గెలిచేది టీడీపీయేనట

July 05, 2020

ఆంధ్రప్రదేశ్‌లో గురువారం జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌లో ఓటర్లు పోటెత్తారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఎన్నికల్లో మేము సైతం అంటూ ఓటేసేందుకు ఉత్సాహంగా, ఉల్లాసంగా పోలింగ్‌ కేంద్రాలకు కదిలారు. పోలింగ్‌ కేంద్రాలు ప్రారంభం నుంచి ముగిసే వరకు పురుషులతో సమానంగా మహిళలు, యువతులతో కిటకిటలాడాయి. ఎండను సైతం లెక్కచేయలేదు. ఈవీఎంలు మొరాయించినా తమ ఓటు వినియోగం వదులుకోలేదు. గంటలకొద్దీ కేంద్రాల వద్ద పడిగాపులు కాశారు. ఉదయం మొదలైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల తరువాత రాష్ట్ర వ్యాప్తంగా అనేక కేంద్రాల్లో కొనసాగింది. ఆ సమయంలోనూ మహిళలు పెద్ద ఎత్తున క్యూ కట్టారు. రాత్రి 10 గంటల వరకు క్యూలో ఉండి తమ ఓటు హక్కును ఆనందంగా వినియోగించుకున్నారు. పెద్దఎత్తున ఓటింగులో పాల్గొనడంతో మేధావులు, రాజకీయ వర్గాల్లోనూ చర్చ సాగింది. తమకు అండగా ఉండే ప్రభుత్వానికి మద్దతు పలికి ఉంటారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదిలాఉండగా, గురువారం ఏపీలో పోలింగ్ తర్వాత అభ్యర్థులు ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్నారు. కొందమంది అయితే విజయావకాశాలపై పందాలు కూడా మొదలయ్యాయి. కౌంటింగ్‌కు 42 రోజులు గడువు ఉండడంతో అభ్యర్థుల్లో అదో టెన్షన్‌ మొదలైంది. ఇప్పటికే పోలింగ్‌ బూత్‌ల వారీ, గ్రామాల వారీ, కులాల వారీ అంచనాలు మొదలుపెట్టారు. అన్ని పార్టీలకు చెందిన వారు ప్లస్‌లు, మైనస్‌ల గురించి సమీక్షిస్తున్నారు. వ్యక్తిగతంగా కూడా ఓటు ఎవరికి వేశారనే విషయం ఆరా తీస్తున్నారు. పోలింగ్‌ సరళి పెరగడం టీడీపీకి లాభిస్తుందని ఆ పార్టీ అంచనాల్లో ఉంది. వైసీపీ, జనసేన పెరిగిన ఓట్ల శాతం తమ విజయానికి సంకేతమని చెబుతున్నాయి. జనసేనకు కాపు యువత ఎక్కువగా చేసినప్పటికీ అన్ని పార్టీలకు కాపు వర్గం నుంచి కొంత శాతం ఓటు వెళ్లినట్టు కనిపించింది. ఈ నేపథ్యంలో గెలుపు ఓటములపై రకరకాల అంచనాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఓ కొత్త చర్చ తెరపైకి వచ్చింది.

గురువారం జరిగిన పోలింగ్‌పై ఎన్నికల కమిషన్ నుంచి స్పష్టత రాలేదు. అసలు ఓటింగ్ ఎంత శాతం నమోదైందన్న దానిపై అధికారులు ప్రకటన చేయలేదు. కానీ, గురువారం సాయంత్రం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేదీ మాత్రం 80 శాతం పైనే నమోదవ్వవచ్చని చెప్పారు. దీంతో ఓ సెంటిమెంట్‌ను గుర్తు చేస్తున్న టీడీపీ నాయకులు. గత డిసెంబర్‌లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో 2014 ఎన్నికల కంటే ఎక్కువ శాతం నమోదైంది. ఈ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితే విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ ప్రభుత్వం తీసుకువచ్చిన సంక్షేమ పథకాలే టీఆర్ఎస్‌ను గెలిపించాయని అందరూ అనుకున్నారు. అదే లెక్కన చూస్తే 2014లో ఏపీలో 76.80 శాతం ఓటింగ్ నమోదైంది. ఇప్పుడు 80 శాతం పైనే ఉండే అవకాశం ఉంది. దీంతో ఇక్కడ కూడా తెలంగాణ తరహా ఫలితాలే వెలువడతాయని తెలుగుదేశం పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఏమవుతుందో తెలియాలంటే కొద్దిరోజులు వేచి చూడాల్సిందే.