అక్కడ జోరుగా క్రాస్ ఓటింగ్.. టీడీపీకే విజయావకాశాలు

July 21, 2019

ఎన్నో రోజులుగా ఎదురు చూసిన సార్వత్రిక ఎన్నికలు సర్వత్రా ఉత్కంఠకు తెరలేపాయి. 30 రోజుల ఎన్నికల సంగ్రామంలో నువ్వానేనా అంటూ తలపడిన రాజకీయపక్షాలకు ఇప్పుడే అసలైన పరీక్ష మొదలైంది. ఫలితాల కోసం నలభై రోజుల పాటు నిరీక్షణ అన్ని పార్టీల నేతలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో అన్ని పార్టీలు గెలుపోటములపై ప్రత్యేకంగా సమీక్షలు నిర్వహించుకుంటున్నాయి. ముఖ్యంగా అధికార తెలుగుదేశం పార్టీతో పాటు ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పోలింగ్ హోరాహోరీగా సాగింది. ఓటింగ్ జరిగిన తర్వాత నుంచి ఈ ఎన్నికల్లో తామంటే తాము గెలుస్తామంటూ ప్రకటనలు చేస్తున్నారు ఆయా పార్టీల నేతలు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం టీడీపీ.. వైసీపీ సిట్టింగ్ ఎంపీ సీటును దక్కించుకోబోతుందట.

గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభావం చూపిన జిల్లాల్లో కర్నూలు ఒకటి. ఈ జిల్లాలో కర్నూలు, నంద్యాల లోక్‌సభ స్థానాలు, 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2014లో రెండు పార్లమెంట్‌ స్థానాలతో పాటు 11 ఎమ్మెల్యేలను వైసీపీ గెలుచుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా హవా సాగించి అధికారం చేజిక్కించుకున్న టీడీపీ జిల్లాలో కేవలం 3 అసెంబ్లీ స్థానాలకు సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. ఇందులో కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఆసక్తికరమైన రాజకీయాలు జరిగినట్లు తెలిసింది. గత ఎన్నికల్లో ఈ స్థానాన్ని వైసీపీ నుంచి పోటీ చేసిన బుట్టా రేణుక గెలుచుకున్నారు. అయితే, ఆ తర్వాత ఆమె టీడీపీలో చేరారు. కానీ, రేణుకకు చంద్రబాబు టికెట్ ఇవ్వలేదు. అంతేకాదు, ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి కర్నూలు పార్లమెంట్ టికెట్ కేటాయించారు.

ఇప్పుడిదే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మారిందనే టాక్ వినిపిస్తోంది. కోట్ల.. టీడీపీలో చేరిన తర్వాత జిల్లాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. దీనికితోడు ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కుటుంబం ఆయనకు సహకరించింది. అంతేకాదు, కర్నూలు లోక్‌సభ స్థానం పరిధిలోని కర్నూలు, ఎమ్మిగనూరు, కోడుమూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ప్రభావం చూపారని తెలుస్తోంది. వైసీపీకి పట్టున్న స్థానాల్లో కూడా క్రాస్ ఓటింగ్ జోరుగా జరిగినట్లు జిల్లాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో కోట్ల గెలుపు ఖాయమేనని వార్తలు వస్తున్నాయి. మరోవైపు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం కర్నూలు జిల్లాలో 2014 ఫలితాలే పునరావృతం అవుతాయనీ చెబుతున్నారు. మరి, విజయం ఏ పార్టీ పక్షాన ఉంటుందో చూడాలి.