తెలంగాణ‌లో బీజేపీ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్:  మంత్రి రేటెంతో తెలుసా ??

May 27, 2020

తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని కైవ‌సం చేసుకోడ‌మే ల‌క్ష్యంగా భార‌తీయ జ‌న‌తా పార్టీ పావులు క‌దుపుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి పార్టీని బ‌లోపేతం చేసే దిశ‌గా, చాప‌కింద నీరులా త‌న ప‌ని తాను చేసుకుంటూ పోతోంది. తెలంగాణ‌లో వ‌చ్చే ఎన్నిక‌ల‌కు మ‌రో నాలుగేళ్ల టైం ఉంది. అయితే బీజేపీ నేత‌లు, కేడ‌ర్ మాత్రం ఆరు నెల‌ల్లో ఎన్నిక‌లు ఉన్న‌ట్టుగా గ్రౌండ్ వ‌ర్క్ చేసుకుంటూ పోతున్నారు. ఇప్ప‌టికే తెలంగాణ‌లో తెలుగుదేశం పార్టీని దాదాపుగా ఖాళీ చేయించిన ఆపార్టీ.. అడ‌ప‌ద‌డ‌పా కాంగ్రెస్ నేత‌ల‌ను కూడా చేర్చుకుంటోంది.

ఇప్పుడు ఏకంగా అధికార పార్టీపైనే క‌న్నేసింది. టీఆ ర్ఎస్ ఎ మ్మెల్యేల‌ను చేర్చుకుని, రాష్ట్రంలో తామే ప్ర‌త్యామ్నాయం అని అధికార పార్టీకి గ‌ట్టి స‌వాల్ విసిరేందుకు సిద్ద‌మవుతోంది. తెలంగాణ‌లో ఎమ్మెల్యేల కొనుగోళ్ల కోసం బీజేపీ అధిష్టానం ఏకంగా రూ. 500 కోట్ల‌ను సిద్ధం చేసిన‌ట్లు రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చే ప్ర‌జాప్ర‌తినిధుల‌కు క‌మ‌ల‌నాథులు భారీ ఎత్తున న‌గ‌దు ఆశ చూపుతున్న‌ట్లు స‌మాచారం. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కావ‌డంతో కాంట్రాక్టులు, ఇత‌ర‌త్రా ప‌ద‌వులు ఆశ చూపి మ‌రికొంద‌రిని త‌మ వైపున‌కు తిప్పుకునే ప్ర‌య‌త్నాలు చేస్తోంది.

ఇక అధికార పార్టీనుంచి వ‌చ్చే ప్ర‌జాప్ర‌తినిధుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్ ఇస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే కొంద‌రు ప్ర‌జాప్ర‌తినిధుల‌తో బీజేపీ అగ్ర‌నేత‌లు బేర‌సారాలు జ‌రుపుతున్నుట్లు స‌మాచారం. ఇప్ప‌టికే ప‌లువురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఢిల్లీ పెద్ద‌ల‌తో కీల‌క చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్లు స‌మాచారం. ఈక్ర‌మంలోనే నిజామాబాద్ జిల్లా బోధ‌న్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ష‌కీల్‌, నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్‌ను క‌ల‌వ‌డం అధికార పార్టీలో క‌ల‌క‌లం రేపుతోంది.

అయితే తాను పార్టీ మారుతున్న‌ట్లు వ‌స్తున్న వార్త‌ల‌ను ష‌కీల్ ఖండించిన‌ప్ప‌టికీ, ఆయ‌న త్వ‌ర‌లోనే కాషాయం కండువా క‌ప్పుకుంటార‌నే ప్ర‌చారం జరుగుతోంది. ష‌కీల్‌తో పాటు మ‌రికొంద‌రు టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరేందుకు రెడీ అవుతున్నార‌నే వార్త‌లు గులాబీ శిబిరాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పార్టీ పెద్ద‌ల‌తో డీల్ కుదిరితే వీరంతా త్వ‌ర‌లోనే క‌మ‌లం గూటికి చేర‌డం ఖాయ‌మ‌మ‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక గ్రామ‌స్థాయిలో ఎవ‌రైతే యాక్టివ్‌గా ఉన్నారో, ఇత‌ర పార్టీల్లో అసంతృప్తితో ఉన్నారో వారిని కూడా త‌మ వైపున‌కు తిప్పుకునేందుకు బీజేపీ ప్ర‌లోబాల ప‌ర్వానికి తెర‌లేపేసింది. ఇది భ‌విష్య‌త్తులో మ‌రింత స్పీడ‌ప్ కానుంది.