కల్నల్ సంతోష్ కుటుంబానికి కోట్లు... ఇంకో సంచలన నిర్ణయం కూడా !

August 07, 2020

టైమింగ్ తో కూడిన నిర్ణయాలు తీసుకోవడం కేసీఆర్ కు ఎవరూ సాటిరారు. అది మరోసారి నిరూపించారు కేసీఆర్. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబం తరఫున ఎవరూ ఆర్థిక సాయం డిమాండ్ చేయకపోనా... ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని కేసీఆర్ ఆనాడే ప్రకటించారు.

ఈరోజు దానికి తగినట్టు సంచలన ప్రకటన చేశారు. సంతోష్ బాబు కుటుంబానికి రూ.5 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు ముఖ్యమంత్రి కేసీఆర్. సంతోష్ తో పాటు చనిపోయిన ఇతర రాష్ట్ర సైనికులకు ఒక్కొక్కరికి రూ.10 లక్షలు ప్రకటించారు. 

కేసీఆర్ నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. ఆర్థిక సాయమే కాకుండా సంతోష్ బాబు కుటుంబానికి  నివాస స్థలం,  భార్యకు గ్రూప్ 1 కేడర్ ఉద్యోగం ఇస్తున్నామని కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. స్వయంగా సంతోష్ బాబు ఇంటికి వెళ్లి ఆ సాయం అందిస్తానని కేసీఆర్ వెల్లడించారు. 

ఈ ప్రకటనతో కేసీఆర్ అందరి మనసు గెలిచాడు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రత్యేక సందేశం ఇచ్చారు. సరిహద్దుల్లో ప్రాణాలను లెక్కచేయకుండా పహారా కాస్తున్న సైనికులకు యావత్ దేశం అండగా నిలవాలని పిలుపునిచ్చారు. మన కోసం పోరాడుతూ అమరులైన సైనికుల కుటుంబాలకు అండగా ఉండాలని నిలబడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. 

ఇది సైనికుల్లో ఆత్మ విశ్వాసం, వారి కుటుంబాల్లో భరోసా నింపి సైన్యంలో మరింత ఉత్సాహం పోరాటపటిమ పెంచుతుందన్నారు. మరోసంచలన వ్యాఖ్య కూడా కేసీఆర్ ఈ సందర్భంగా చేశారు. అమర సైనికులకు కేంద్రంతో పాటు ఆయా రాష్ట్రాలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. సంతోష్ కుటుంబాన్ని కేసీఆర్ పరామర్శించలేదని విమర్శలు వస్తున్న నేపథ్యంలో కేసీఆర్ వాటికి చెక్ పెట్టారు.