ఈటెల సిగ్గుతో తలదించుకోవాలంటున్నాడు

August 05, 2020

ప్రజల కష్టాల్ని.. వేదనల్ని.. వెతల్ని.. మనసుకు తాకేలా మాట్లాడే సత్తా ఉన్న నేతగా మంత్రి ఈటెల రాజేందర్ సుపరిచితుడు.

తెలంగాణ ఉద్యమంలో ప్రజలు పడుతున్న కష్టాలు.. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రజలు చేస్తున్న ఆత్మ బలిదానాల మీద ఆయన మాటలు కోట్లాది మందిని కదిలించటమే కాదు.. ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసేందుకు సాయం చేశాయి.

అప్పట్లో ప్రజలంతా ఒక్కటయ్యేలా చేసిన ఈటెల మాటలు.. ఇప్పుడు అందరూ వేలెత్తి చూపేలా ఉన్నాయని చెబుతున్నారు.

ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యంతో సామాన్యుడు ఒకరు మరణిస్తే.. దానిపై బాధ్యత వహించటం.. అందుకు కారణమైన వారికి హెచ్చరికలు జారీ చేయాల్సింది పోయి.. రివర్సులో మీడియా.. సోషల్ మీడియా మీదా విరుచుకుపడిన తీరును పలువురు ప్రశ్నిస్తున్నారు.

తాజాగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సారధి కమ్ ఎంపీగా ఎన్నికైన ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు.. రాష్ట్ర ఆరోగ్య మంత్రి ఈటెలపై ఘాటు విమర్శలు చేశారు.

కేసీఆర్ తుగ్లక్ పాలనతోనే ఈ రోజున కేసుల తీవ్రత ఇంత ఎక్కువగా ఉందని తప్పుపట్టారు.

తాము చెప్పిన విధానాన్ని అమలు చేసి ఉంటే.. ఈ రోజున హైదరాబాద్ లో ఇంత భారీగా కేసులు నమోదు అయి ఉండేవి కాదని చెప్పారు.

గాంధీ ఆసుపత్రిలో వైద్య సేవలు అద్భుతంగా ఉండి ఉంటే.. ఇటీవల కాలంలో పాజిటివ్ గా తేలిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎందుకు చేరుతున్నారు? అని ప్రశ్నించారు.

మహమ్మారికి వైద్యం చేసేందుకు వీలుగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అన్ని ఆసుపత్రుల్ని కోవిడ్ ఆసుపత్రులుగా మార్చాల్సిన అవసరం ఉందని చెప్పారు.

ఆక్సిజన్ అందక రవికుమార్ మరణించాడని.. అతడు పెట్టిన సెల్ఫీ వీడియోకు సమాధానం చెప్పాల్సింది పోయి.. అందుకు భిన్నంగా మీడియాను భయపెడతారా? అని ప్రశ్నించారు.

ఇటీవలకాలంలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో మంత్రిగా ఈటెల తలదించుకోవాల్సి ఉందని.. అందుకు భిన్నంగా భయపెట్టేలా విమర్శలు చేయటం ఏమిటని ప్రశ్నించారు.

కోవిడ్ విధుల్లో చనిపోయిన ఫ్రంట్ లైన్ వారియర్స్ కు రూ.50 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వాలంటూ డిమాండ్ ను తెర మీదకు తీసుకొచ్చారు.

ఈ జాబితాలో జర్నలిస్టులు.. పోలీసుల్ని చేర్చాలని ఉత్తమ్ డిమాండ్ చేస్తున్నారు. 

ఇదిలా ఉంటే మరికొందరు కాంగ్రెస్ నేతలు సైతం ఈటెల వ్యాఖ్యల్ని తప్పుపడుతున్నారు. 

‘కరోనా రోగి.. చనిపోతూ తన ఆవేదనను రికార్డు చేసి తండ్రికి పంపితే.. ఆ బాధను అర్థం చేసుకోవాలి గానీ, వీడియో రికార్డు చేసి బయటికి పంపడం న్యాయమా అంటూ అడుగుతారా? మానవత్వం ఉన్నవాళ్లెవరూ ఇలాంటి ప్రశ్నలు వేయరు’’ అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి మండిపడ్డారు.

ఇలా పలువురు చేస్తున్న ఘాటు వ్యాఖ్యలపై మంత్రి ఈటెల ఎలా రియాక్టు అవుతారో?