తెలంగాణలో విపక్ష నేతల హోం అరెస్టులు ఎందుకు?

August 13, 2020

నిరసనలు.. ఆందోళనలు.. పోరాటాలే లక్ష్యంగా చేసుకొని రాష్ట్రాన్ని సాధించుకున్న తెలంగాణలో తాజా పరిస్థితి చూసినప్పుడు ఒకింత ఆశ్చర్యానికి గురి చేయక మానదు. ఏ నిరసనలతో రాష్ట్రాన్ని సాధించారో.. ఇప్పుడు అదే నిరసనలు సొంత రాష్ట్రంలో చేసుకోలేని స్థితిలో విపక్ష నేతలు ఉండటానని తీవ్రంగా తప్పు పడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్ని చూస్తే.. ఆంధ్రాతో పోలిస్తే.. తెలంగాణ ప్రజల్లో చైతన్యం ఎక్కువ. దానికి తోడు.. తమ స్వేచ్ఛను కాలరాస్తానంటే దేనికైనా రెఢీ అన్నట్లుగా వ్యవహరించటం కనిపిస్తుంది.

అందుకే సుదీర్ఘకాలంగా తాము డిమాండ్ చేసిన రాష్ట్రాన్ని సాధించుకున్నారని చెప్పాలి. అలాంటి రాష్ట్రంలో తమ వాదనలు వినిపించేందుకువీలుగా విపక్ష కాంగ్రెస్ నేతలు చేపట్టిన నిరసనల్ని.. ఆందోళనల్ని నొక్కి పట్టేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యల్ని విపక్ష నేతలు మండిపడుతున్నారు. మాయదారి మహమ్మారి కారణంగా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం కొంతకాలం తెరవెనక్కి వెళ్లిపోయింది.

విపక్ష నేతలు సైలెంట్ గా ఉండిపోవటంతో రాజకీయ రగడ లేదు. అందుకు భిన్నంగా ఈ రోజు జరుగుతున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేళ.. ప్రభుత్వ విధానాల్ని తప్పు పడుతూ.. నిరసనలు.. ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించారు. తెలంగాణ వచ్చి ఆరేళ్లు అవుతున్నా.. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయని కేసీఆర్ సర్కారు తీరును తీవ్రంగా తప్పు పడుతున్నారు కాంగ్రెస్ నేతలు.

వారు చేసే నిరసనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఆందోళనలు చేపట్టే కాంగ్రెస్ నేతలు ఇంటి ముందు పెద్ద ఎత్తున పోలీసుల్ని మొహరించారు. వారు ఇళ్లల్లో నుంచి బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. హౌస్ అరెస్టు చేశారు. పోలీసుల తీరుపై కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఈ రోజు తెల్లవారుజామునే కాంగ్రెస్ ముఖ్యనేతలు అందరి ఇళ్ల ముందు పోలీసుల్ని మొహరించారు. కాలు బయటపెట్టకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఊహించని రీతిలో మొహరించిన పోలీసులతో కాంగ్రెస్ నేతలు అవాక్కు అయ్యారు. ప్రజాస్వామ్య బద్ధంగా నిరసనలు తెలిపే అవకాశం సొంతం రాష్ట్రంలో లేదా? అంటూ మండిపడుతున్నారు.