గవర్నర్ కి నో చెప్పిన సీఎస్ - తెలంగాణలో గవర్నర్ vs సీఎం

August 05, 2020

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా నరసింహన్ వ్యవహరించిన సమయాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి.

ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు.. విధానాలు.. అనుసరించే అంశాలకు సంబంధించి ఎప్పటికప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్ భవన్ కు వెళ్లేవారు.

దేశంలోని మరే రాష్ట్రంలో లేని విధంగా గవర్నర్ వద్దకు తరచూ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్లటం ఒక ఎత్తు అయితే.. గంటల పాటు కూర్చొని ప్రభుత్వ విధానాల్ని వివరించే తీరు తెలంగాణ సీఎంలోనే చూస్తున్నామని పలువురు నేతలు వ్యాఖ్యానించేవారు.

ఒకవేళ.. తమ ప్రభుత్వం చేపట్టే అన్ని అంశాలు గవర్నర్ కు తెలియాలన్నదే సీఎం కేసీఆర్ ఆలోచనే అయితే.. నరసింహన్ తర్వాత ఆ కుర్చీలో కూర్చున్న తమిళ సై విషయంలోనూ అదే జరగాలి కదా? మరి.. అలా ఎందుకు జరగటం లేదు? అన్నది ప్రశ్న.

తెలంగాణ గవర్నర్ గా తమిళ సై పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎప్పుడూ కూడా.. నరసింహన్ ను కలిసినట్లుగా కేసీఆర్ కలవలేదని చెప్పాలి.

ఆ మాటకు వస్తే.. ఎంతో ముఖ్యమైన కార్యక్రమం ఉంటే తప్పించి వెళ్లని పరిస్థితి.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ తోపాటు. వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని రాజ్ భవన్ కు రావాల్సిందిగా రాజ్ భవన్ నుంచి కబురు వచ్చింది.

ఈ ఆహ్వానాన్ని అనూహ్యంగా తిరస్కరించటమే కాదు.. తమకు ముందుగానే ఖరారైన కార్యక్రమాలు ఉన్నాయని.. తామురాజ్ భవన్ కు రాలేమని చెప్పిన వైనం హాట్ టాపిక్ గా మారింది.

గవర్నర్ నుంచి సమావేశానికి ఆహ్వానం అందిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో వెళ్లాల్సిన అవసరం ఉంది. అందుకు భిన్నంగా తమకు షెడ్యూల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయని.. రాలేమని చెప్పటం ఏ మాత్రం సరికాదంటున్నారు.

గవర్నర్ ఆదేశాల్ని ధిక్కరించే సాహసాన్ని ఉన్నతాధికారులు చేయరని అంటున్నారు.

కానీ.. అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొనటం చూస్తే.. రానున్న రోజుల్లో మరిన్ని ఉదంతాలు చోటు చేసుకునే వీలుందన్నమాట వినిపిస్తోంది.

ఇంతకాలం నివురుగప్పిన నిప్పులా ఉన్న పరిస్థితి నుంచి గవర్నర్  వర్సెస్ సర్కారు మధ్య ప్రచ్ఛన్నయుద్ధం జరిగే అవకాశం ఉందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.

తన ఆహ్వానాన్ని కాదని చెప్పిన ఉన్నతాధికారులపై గవర్నర్ ఎలా రియాక్టు అవుతారన్నది ఇప్పుడు అసలు ప్రశ్నగా చెబుతున్నారు.

దీనికి కాలమే సరైన సమాధానం చెబుతుందన్న మాట వినిపిస్తోంది.