కేసీఆర్... దానికి బై చెప్పినట్లేనా?

August 13, 2020

కేసీఆర్ కో^విడ్ వ్యవహారం నుంచి పక్కకు తప్పుకున్నారా? ఇక దానిని తన కుమారుడు కేటీఆర్, ఆరోగ్యమంత్రి కేటీఆర్ లకు వదిలేశారా? అవుననే అన్నట్లు పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆదివారం తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఇంతకాలం నిరంతరం కో^విడ్ సమీక్షలపైనే ఉండేవారు. ఆదివారం నుంచి రూటు మార్చారు. నిన్న పీఎం కాన్ఫరెన్స్ అనంతరం ఇక తన దృష్టిని ఇతర రంగాలపై మళ్లించారు. 

వ్యవసాయ శాఖ క్షేత్ర అధికారులు, రైతు బంధు సమితి ప్రతినిధులతో కేసీఆర్ వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడారు. వాస్తవానికి శనివారం కూడా ఆయన వ్యవసాయం రంగంపైనే దృష్టి పెట్టారు. రుణమాఫీ, రుతుపవనాలు, వ్యవసాయ ఏర్పాట్లు వంటివాటిపై దృష్టిపెడుతున్నారు. జూన్ 8 నాటికి రుతుపవనాలు రాష్ట్రానికి వస్తాయని వార్తలు రావడంతో ఇక తాను గట్టిగా నమ్మకం పెట్టుకున్న ఆ రంగంపై కేసీఆర్ దృష్టిపెట్టారు. దీనికోసం తాను తీవ్ర కృషితో రూరల్ తెలంగాణలో కేసులు లేకుండా చేసుకున్నారు.

ఇక తాజా సమావేశంప్రతిపాదిత సమగ్ర వ్యవసాయ విధానం, వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చడం... అనే అజెండాతో నిర్వహించారు. ప్రజల ఆహారపు అలవాట్లకు అనుగుణంగా, మార్కెట్ డిమాండ్ ప్రకారం రైతులు పంటలను పండించే విధానాన్ని సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. 

“రైతులు పండించాల్సిన పంటలపై రైతులు కాదు, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ప్రజల ఆహార అవసరాలతో పాటు మార్కెట్ డిమాండ్ కూడా తీర్చాలి. ప్రత్యామ్నాయ పంటలను గుర్తించి, తదనుగుణంగా సాగు చేయడానికి రైతులకు మార్గనిర్దేశం చేయాలి. ఆ తరువాత, ప్రతి పంటకు కనీస మద్దతు ధరను ప్రభుత్వం నిర్ధారిస్తుంది. ఇది ఉభయకుశలోపరిగా ఉంటుది. దీనివల్ల రైతులు మరింత ఆదాయం సాధించగలుగుతారు” అంటూ కేసీఆర్ అధికారులకు సూచించారు.

ఈ ఏడాది కొత్త నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తయిన దృష్ట్యా వానాకాలం (ఖరీఫ్) పంట సీజన్‌లో సుమారు 90 లక్షల ఎకరాల్లో వరిని సాగు చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. వార్షిక ఉత్పత్తి 2.70 లక్షల టన్నుల ఉండొచ్చని అంచనావేస్తున్నట్లు చెప్పారు. ఉత్పత్తి చేసినంత మాత్రాన సరిపోదు. దీనికి భారీ మిల్లింగ్ సామర్థ్యం అవసరం. కొత్త రైస్ మిల్లులను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని, కాబట్టి ఆ విధంగా కూడా మనం సిద్ధం కావాల్సి ఉంటుందన్నారు.

రైతు బంధు నిబంధనల్లో మార్పులు ?

ఈ సందర్భంగా ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికలకు అనుగుణంగా పంటలను పండించని రైతులకు రైతు బంధు ప్రయోజనాలు ఇవ్వవద్దని, కనీస మద్దతు ధర చెల్లించవద్దని కొందరు అధికారులు సూచించారు. అయితే దీనిపై నిర్ణయం తీసుకోలేదు. ఇది బూమ్ రాంగ్ అయ్యి ప్రతిపక్షాలకు ఆయుధంగా మారే అవకాశం లేకపోలేదు.

ప్రతి గ్రామంలో ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, ఇతర యంత్రాలు, వ్యవసాయ పరికరాల లభ్యతపై అధికారులు నివేదిక తయారు చేయాలని కేసీఆర్ ఆదేశించారు. ప్రతి రైతుకు సంబంధించిన పూర్తి సమాచారం మన వద్ద ఉండాలి. అపుడు మాత్రమే మెరుగైన దిగుబడి సాధించగలం అని కేసీఆర్ అన్నారు.